గిరిజన మైనర్‌ బాలికలపై దారుణాలు

Minor Girls Forced To Trade Their  Bodies In Chitrakoot - Sakshi

బుందేల్‌ఖండ్ : పేద‌రిక‌మే ఆ బాలిక‌ల‌కు శాపంగా మారింది. పాఠ‌శాలకు వెళ్లి చ‌దువుకోవాల్సిన వారిని గ‌నుల్లో ప‌నిచేసేలా చేసింది. లైంగిక దోపిడికి గుర‌య్యేలా చేసింది. ఈ ప‌రిస్థితి వారిత‌ల్లిదండ్రుల‌కు కూడా తెలుసు కానీ ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ‌త‌. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి 700 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న చిత్ర‌కూట్‌లో సాగుతోంది ఈ దురాగ‌తం. గిరిజ‌న బాలిక‌ల పేద‌రికాన్ని అడ్డుపెట్టుకొని కొంద‌రు ధ‌న‌వంతులు ఇష్టారాజ్యంగా లైంగిక దోపిడికి పాల్పడుతున్న దీన‌గాథ ఇది. చిత్ర‌కూట్ ప్రాంతంలో ఆడ‌పిల్ల‌లు చ‌దువుకోవ‌డ‌మే చాలా అరుదు. ఒక‌వేళ స్కూల్‌కి వెళ్లినా 7వ త‌ర‌గ‌తే మ‌హా ఎక్కువ. కుటుంబ పోష‌ణ కోసం ఆ చిన్నారులు ఆ అక్ర‌మ గ‌నుల్లో పనిచేయాల్సిందే.. కానీ అక్క‌డ కూడా వారి శ్ర‌మ‌కు త‌గ్గ డ‌బ్బులు ఇవ్వ‌రు శ్ర‌మ‌దోపిడీ చేస్తారు. అంతేనా.. పేద‌రికాన్ని అడ్డుపెట్టుకొని వారిని లైంగికంగా దోచుకుంటారు. పొట్ట‌కూటి కోసం ఏమీ చేయ‌లేక బాలిక‌లు వారి శ‌రీరాల‌ను 200-300 రూపాయ‌ల‌కు అమ్ముకోవాల్సిన దుస్థితి. భారతీయ శిక్షాస్మృతిలోని చ‌ట్టాలు, నిబంధ‌న‌లేవీ చిత్ర‌కూట్ ప్రాంతం దాకా ద‌రిచేర‌వు. అక్క‌డి మైన‌ర్ బాలిక‌లు లైంగికంగా దోపిడీకి గుర‌వుతున్నా ప్ర‌భుత్వాల‌కు ప‌ట్ట‌దు. 

‘నా పేరు రింకు (పేరు మార్చాం). కాంట్రాక్ట‌ర్లు మాతో చాలా ప‌ని చేయించుకుంటారు. కానీ ముందు చెప్పినంత డ‌బ్బులివ్వ‌రు. మ‌మ్మ‌ల్ని శారీర‌కంగా వాడుకుంటారు. ఒక‌వేళ తిర‌గ‌బ‌డితే చంపేస్తామ‌ని బెదిరిస్తారు. రోజుకి 200-300 రూపాయ‌లు ఇస్తామ‌ని ప‌నికి కుదుర్చుకొని కేవ‌లం 150 రూపాయ‌లే ఇస్తారు. మిగిలిన డ‌బ్బులు ఇవ్వాలంటే వాళ్ల‌కి స‌హ‌క‌రించాల్సిందే. కుటుంబ పోష‌ణ కోసం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఏమీ చేయ‌లేక దానికి ఒప్పుకుంటాం. కొన్నిసార్లు అయితే ఒక‌రి కంటే ఎక్కువ మంది మాపై అత్యాచారానికి పాల్ప‌డ‌తారు’ అంటూ మీడియాతో గోడు వెళ్లబోసుకుంది.

‘లాక్‌డౌన్ కార‌ణంగా మా బ‌తుకులు చాలా ద‌య‌నీయంగా మారాయి. అనారోగ్యం కార‌ణంగా మా ఆయ‌న  మంచాన ప‌డ్డాడు. దీంతో నా బిడ్డ సౌమ్య (పేరు మార్చాం)ను 7వ త‌ర‌గ‌తి మ‌ధ్య‌లోనే చ‌దువు మాన్పించా. ప‌నికి పోతుండేది. కానీ లాక్‌డౌన్ వ‌ల్ల ప‌రిస్థితులు త‌ల‌కిందుల‌య్యాయి. ప‌ని లేక‌పోవ‌డంతో ఆ కాంట్రాక్ట‌ర్లు దీన్నే ఆస‌రాగా చేసుకొని నా బిడ్డ లాంటి ఎంతోమంది బాలిక‌ల‌ను లైంగికంగా హింసిస్తున్నారు. వాళ్ల‌పై తిర‌గ‌బ‌డే శ‌క్తి మాకు లేదు ఎందుకంటే మా బ‌తుకులు అలాంటివ’ని రింకు తల్లి వాపోయింది.

చిత్ర‌కూట్‌లో జ‌రుగుతున్న ఈ అఘాయిత్యాల‌పై ఓ జాతీయ మీడియా ప్ర‌చురించిన క‌థ‌నంపై జిల్లా  మేజిస్ట్రేట్ స్పందించి ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. చ‌ట్ట ప‌రంగా వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జిల్లా మేజిస్ట్రేట్ శేష్ మణిపాండే హామీ ఇచ్చారు. దీనిపై  దర్యాప్తు చేయడానికి  ఓ బృందాన్ని నియ‌మించారు. ఇలాంటివి భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌కుండా చేస్తామ‌ని అంతేకాకుండా గ్రామ వార్డు స‌భ్యులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, గ్రామాల్లో జ‌రిగే ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు నివేదించాలని చిత్ర‌కూట్ ఎఎస్పీ  ఆర్ఎస్ పాండే కోరారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top