ఏసీల్లో కనిష్ట ఉష్ణోగ్రత ఇకపై 24 డిగ్రీలే

Minimum temperature in AC is 24 degrees - Sakshi

     విద్యుత్‌ ఆదా, గ్రీన్‌ హౌస్‌ వాయువులకు చెక్‌

     ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన బీఈఈ

ఎయిర్‌ కండీషనర్‌.. ప్రస్తుతం నగరజీవుల ఇళ్లలో తప్పనిసరిగా మారిన ఉపకరణం. బహుళ జాతి సంస్థల నుంచి ప్రభుత్వ ఆఫీసులు, సంస్థల్లో ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విద్యుత్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఓజోన్‌ పొరను దెబ్బతీసే గ్రీన్‌హౌస్‌ వాయువులు భారీగా వాతావరణంలోకి వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీల్లో కనిష్ట ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌ చేయాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విద్యుత్‌ ఆదాకు ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని సూచించింది. ఈ సిఫార్సుల్ని అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్కే సింగ్‌ తెలిపారు.

లాభమేంటి..?
ఎయిర్‌ కండీషనర్ల(ఏసీ)లో ఉష్ణోగ్రతను ఒక్క డిగ్రీ మేర పెంచితే దాదాపు 6 శాతం విద్యుత్‌ను ఆదా చేయొచ్చు. తద్వారా అనవసరమైన ఖర్చు తగ్గుతుంది. అలాగే మానవశరీరం సగటు ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. కానీ బహుళజాతి సంస్థలు, కంపెనీల్లో ఉష్ణోగ్రత 18–21 డిగ్రీల మధ్య ఉంటుంది. ఇంత చల్లటి వాతావరణంలో దీర్ఘకాలం పనిచేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు దుబారా వ్యయాన్ని తగ్గించేందుకు ఏసీల్లో ఉష్ణోగ్రత 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉండేలా సెట్టింగ్స్‌ను తప్పనిసరి చేయాలని బీఈఈ కేంద్రానికి సూచించింది.  దీనివల్ల ఏటా 2,000 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం జపాన్‌ సహా పలుదేశాల్లో ఏసీల కనిష్ట ఉష్ణోగ్రతను 28 డిగ్రీలకు పరిమితం చేయడాన్ని బీఈఈ నివేదికలో పేర్కొంది.

అమలు చేసేదెలా..
ఏసీల్లోఉష్ణోగ్రతను డీఫాల్ట్‌గా 24 డిగ్రీలు చేయాలని తొలుత విమానాశ్రయాలు, హోటళ్లు, షాపింగ్‌ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు సహా పలు సంస్థలకు ప్రభుత్వం సూచించనుంది. ఆ తర్వాత 4 నుంచి 6 నెలల పాటు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ప్రజల నుంచి అభిప్రాయా లను సేకరించి, చివరికి ఏసీల్లో 24 డిగ్రీల ఉష్ణో గ్రతను తప్పనిసరి చేస్తారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో విద్యుత్‌ మంత్రి ఆర్కే సింగ్‌ స్పందిస్తూ.. ‘ఏసీల్లో ఉష్ణోగ్రతను 24 డిగ్రీలకు పరిమితం చేయడం వినియోగదారులకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది’ అనే సూచనను కంపెనీలు ఏసీలపై ముద్రించాలని కోరారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top