వలసల భారతం ఏం చెబుతోంది?

Migration in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్‌ నాథ్‌ మాట్లాడుతూ స్థానికుల ఉద్యోగావకాశాలను ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వలసవచ్చిన వారు తన్నుకుపోతున్నారని ఆరోపించారు. ఇక నుంచి స్థానికులకు 70 శాతం ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు తన ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని కూడా హామీ ఇచ్చారు. ఆయన మాటల్లో నిజమెంత ? అబద్ధం ఎంత ? అసలు వాస్తవం ఎంత ?

వాస్తవానికి మధ్యప్రదేశ్‌కు వలసవస్తున్న వారి కన్నా మధ్యప్రదేశ్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. 1991–2001 దశాబ్దంతో పోలిస్తే 2001 నుంచి 2011 దశాబ్దానికి రాష్ట్రం నుంచి వలసపోతున్న వారి సంఖ్య 461 శాతం పెరిగింది. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాలకన్నా వలసపోతున్న వారి సంఖ్య తక్కువే. మధ్యప్రదేశ్‌ నుంచి ఒక్కరు వలసపోతే బీహార్‌ నుంచి 3.5, ఉత్తరప్రదేశ్‌ నుంచి 7.6 శాతం మంది ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. బీహార్‌ నుంచి వలసపోతున్నవారి కన్నా వలసవస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ అంటే యూపీ నుంచి బీహార్‌ నుంచి ఆ రాష్ట్రానికి వలస పోతున్నవారి సంఖ్య మరీ తక్కువనే విషయం అర్థం అవుతోంది. యూపీ, బీహార్‌ నుంచి గతంలో ఎక్కువ మంది మహారాష్ట్రకు వెళ్లగా ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్‌ పట్టణాలకు ఎక్కువగా వెళుతున్నారు. గతంతో పోలిస్తే యూపీ నుంచి వలసపోతున్న వారి సంఖ్య దశాబ్ద కాలంలో 197 శాతం పెరగ్గా, బీహార్‌ నుంచి 237 శాతం పెరిగింది.

భారత దేశంలోని ప్రజలు ఉద్యోగావకాశాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం కొత్త విషయం కాదు. స్వాతంత్య్రానికి ముందునుంచి ఉన్నదే. అయితే స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఎక్కడికైనా వెళ్లి స్థిర నివాసం ఏర్పరుచుకునే హక్కు ప్రతి భారతీయుడికి రాజ్యాంగ పరంగా సంక్రమించింది. ఈ వలసలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయి. కొన్ని రాష్ట్రాలు కూడా విడిపోవాల్సి వచ్చింది. 
1960వ దశకంలో తమిళనాడులో హిందీ భాషకు, హిందీ మాట్లాడే వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆ తర్వాత అస్సాంలో బెంగాలీ, హిందీ, నేపాలీ భాషలు మాట్లాడే వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. ఇక మహారాష్ట్రలో 1960 దశకం నుంచి ఇప్పటికీ ఉత్తర భారతీయులతోపాటు దక్షిణ భారతీయులు కూడా స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ మరాఠీ నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. 2017లో కర్ణాటకలో కూడా హిందీ మాట్లాడేవారికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. మొన్న అక్టోబర్‌ గుజరాత్‌లో హిందీ మాట్లాడేవారిపై దాడులు జరగ్గా వేలాది మంది గుజరాత్‌ నుంచి పారిపోయారు. హిందీ మాట్లాడే వారు తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ ఇతర రాష్ట్రాల వారు ఇంతవరకు ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తుండగా, తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ ఓ హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ ఆరోపించడం ఇదే తొలిసారి.  2011 జనాభా లెక్కల ప్రాతిపదికన 2017 నాటికి దేశంలో వలసపోయిన వారి సంఖ్య 45.36 కోట్లు. ఈ సంఖ్య మరింత పెరిగితే చైనాలోలాగా వలసల నియంత్రనకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి రావచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top