
బనిహాల్ / జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రంబన్ జిల్లాలోని ఓ గ్రామంలో పశువుల వ్యాపారులపై ఆర్మీ జవాన్లు కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి చనిపోగా, మరొకరు గాయపడ్డారు. అయితే తమపై కాల్పులు జరగడంతోనే ఎదురుకాల్పులు ప్రారంభించామని ఆర్మీ చెబుతోంది. గూల్ ప్రాంతానికి చెందిన పశువుల వ్యాపారులు మొహ్మద్ రఫీక్ గుజ్జర్(28), షకీల్ అహ్మద్(30) ఆదివారం ఉదయం 4 గంటలకు స్వగ్రామానికి తిరిగివస్తుండగా జవాన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రఫీక్ అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ షకీల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాల్పులు జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యం కాలే దు. ఈ ఘటనకు సంబంధించి ఆర్మీ జవాన్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో కోహ్లి ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు జరుపుతుండగా అనుమానాస్పద కదలికల్ని గమనించిన ఆర్మీ జవాన్లు ఆవ్యక్తులను ఆపి గుర్తింపును చెప్పాల్సిందిగా కోరాయని సైన్యం తెలిపింది. అయితే, జవాన్లపై నిందితులు కాల్పులు జరిపడంతో ప్రతిగా ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఒకరు చనిపోగా, మరొకరు గాయపడ్డారని సైనికాధికారులు అంటున్నారు.