27 లక్షల ఓట్లు గల్లంతా?!

Mass Deletions Of Voter Names Reported In Telangana Elections 2018 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి దాదాపు 27 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతవడం లేదా తొలగించడం ఎంతో ఆందోళనకరమైన అంశం. ఇటు మీడియాతోపాటు అటు సోషల్‌ మీడియాలో విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తడంతో శుక్రవారం నాడు పోలింగ్‌ ముగిశాక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అందుకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. 27 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయంటే ప్రతి పది మంది ఓటర్లలో ఒకరికి ఓటు హక్కు పోయినట్లే.

వేలు ముద్రల గుర్తింపు కలిగిన ఆధార్‌ కార్డులతో ఓటరు గుర్తింపు కార్డులను అనుసంధాలించాలంటూ 2015లో భారత ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచే రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభమైందన్న విమర్శలు గతంలోనే వెల్లువెత్తాయి. ఓటర్ల గుర్తింపు కార్డులకు కూడా ఆధార్‌ కార్డు నెంబర్లను అనుసంధాలించాలంటూ కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ ఎలక్టోరల్‌ రోల్‌ ప్యూరిఫికేషన్‌ అండ్‌ అథెంటికేషన్ (ఎన్ఈఆర్‌పీఏపీ)‌’ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఒకరికి రెండు, మూడు ఓటరు గుర్తింపు కార్డులు లేకుండా చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాడు కేంద్రం ప్రకటించింది. అయితే ఆధార్‌ కార్డు లేని వారు ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుంది కనుక తక్షణమే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

ఆధార్‌ కార్డులేని ఓటరును గుర్తించేందుకు నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయడం వల్ల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయా? లేదా ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లను తొలగించారా ? అన్నది ప్రధాన ప్రశ్న. కొన్ని వర్గాల ప్రజల ఓట్లే గల్లంతయ్యాయి కనుక, ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లను తొలగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఏ కారణంతో ఓటర్ల పేర్లను తొలగించిన సదరు ఓటర్లకు సమాచారం తప్పనిసరిగా అందించడం ఎన్నికల సంఘం బాధ్యతని, ఏ కారణంతో తొలగించాల్సి వస్తుందో, మళ్లీ దరఖాస్తు ఎలా చేసుకోవాలో, అందుకు కావాల్సిన ధ్రువపత్రాలేవో కూడా స్పష్టంగా వివరించాలంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఆ మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్రంలో పాటించిన దాఖలాలు కనిపించడం లేదు.

ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల సంఘం గల్లంతయిన ఓటర్ల జాబితాను విడుదల చేయాలి. ఆ జాబితాను పరిశీలిస్తే ఏయే అసెంబ్లీ నియోజక వర్గంలో ఎలాంటి ప్రభావం ఉండేదో రాజకీయ పరిశీలకుల అవగాహనకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడమే కాదు, నిర్వహించినట్లు కనిపించడం కూడా ముఖ్యమేనని సుప్రీం కోర్టే అభిప్రాయపడింది కనుక వీలైనంత త్వరగా ఎన్నికల కమిషన్‌ ఈ జాబితాను విడుదల చేయడంతో 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాను సవరించాలి. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top