తండ్రి కోరిక మేరకు దిష్టిబొమ్మతో పెళ్లి

UP Man Marries Wooden Effigy On 90 Year Old Father Last Wish - Sakshi

లక్నో : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మదురస్మృతిగా నిలిచిపోతుంది. పెళ్లి చేసుకునే వారు తమకు మంచి భార్య రావాలని కలల కంటారు. అందమైన అమ్మాయి తన జీవితంలోకి రావాలని కోరుకుంటూ ఆమె కోసం అన్వేషిస్తుంటారు.కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక యువ‌కుడు మాత్రం అమ్మాయిని పోలిన దిష్టిబొమ్మ‌ను వివాహం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శివమోహన్‌(90)కు తొమ్మిది మంది సంతానం. అందరిలోకి చిన్నవాడైనా పంచరాజ్‌ పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. (ప్రగ్నెంట్‌ అని తెలీకుండానే బిడ్డ‌కు జన్మ‌నిచ్చింది)

శివ మోహన్‌ తనకున్న ఆస్తితోనే పిల్లలందరిని పెద్ద చేసి వారికి వివాహాలు జరిపించాడు. అయితే పంచరాజ్‌కు కూడా పెళ్లి చేయాలని తండ్రి శివ మోహన్‌ అనుకున్నాడు. కానీ పంచరాజ్‌ మానసిక వికలాంగుడు కావడంతో అమ్మాయి దొరకడం కష్టంగా మారింది. దీంతో తన కుమారుడికి ఎలాగైనా పెళ్లి చేయాలని సంకల్పించుకున్న శివమోహన్‌ పెళ్లికుమార్తెను పోలిన దిష్టిబొమ్మను తయారు చేసి హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం పంచరాజ్‌కి వివాహం జ‌రిపించారు. పైగా వివాహానికి హాజరైన వారికి చక్కని విందు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ పెళ్లిని మొద‌ట పంచరాజ్ తిర‌స్క‌రించాడు. చివ‌ర‌కు తండ్రి కోరిక మేర‌కు, ఆయ‌న గౌర‌వాన్ని నిల‌బెట్టేందుకు దిష్టి బొమ్మ‌తో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు.


ఇదే విషయమై శివమోహన్‌ స్పందిస్తూ..' ఇప్పుడు నా వయసు 90 ఏళ్లు.. నాకు తొమ్మిది మంది పిల్లలు.. నా 8 మంది పిల్లలకు పెళ్లి చేశా. కానీ మానసిక వికలాంగుడైన నా చిన్నకొడుకు పంచరాజ్‌కు కూడా ఎలాగైనా పెళ్లి చేయాలని తీర్మానించకున్నా. అందుకే వాడిని ఒప్పించి పెళ్లికూతురు రూపంలో ఉన్న దిష్టిబొమ్మను తయారు చేసి అంగరంగ వైభవంగా వివాహం జరిపించా' అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ పోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top