
రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఆర్మీకి అవమానం: ఖర్గే
ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతం కావడానికి నరేంద్రమోదీ కారణమని రక్షణ శాఖమంత్రి మనోహర్ పారికర్ పేర్కొనడం భారత సైనికులను అవమానించడమేనని మల్లికార్జున ఖర్గే అన్నారు.
బెంగళూరు: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతం కావడానికి ప్రధాని నరేంద్రమోదీ కారణమని రక్షణ శాఖమంత్రి మనోహర్ పారికర్ పేర్కొనడం భారత సైనికులను అవమానించడమేనని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయన కర్ణాటకలోని కలబుర్గిలో మీడియాతో గురువారం మాట్లాడారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వినియోగించుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రధాని నరేంద్రమోదీ ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిగానే భావిస్తున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. ఆయన దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా కేవలం ఒకట్రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తుండటం సరికాదని ఖర్గే చెప్పారు. భారత ఆర్మీ పీఓకేలో గత నెల 28అర్ధరాత్రి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి 7 పాక్ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంతో పాటు దాదాపు 38 మంది ఉగ్రవాదులను హతం చేసిన విషయం తెలిసిందే.