
పుష్ప అమర్‌నాథ్
శివాజీనగర (బెంగళూరు): రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా తాజాగా ఎంపికైన పుష్ప అమర్‌నాథ్.. బాధ్యతలు స్వీకరించకముందే తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. మహిళా అధ్యక్షురాలిగా సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, ఆ కార్యక్రమానికి హాజరయ్యే మహిళలకు ఆమె డ్రెస్ కోడ్ పెట్టారు. విధిగా చీరలే ధరించాలని, అవీ నీలిరంగువే అయి ఉండాలని నిర్దేశించారు. అలాగే, లిప్‌స్టిక్ వేసుకోకూడదని, మేకప్ అవసరం లేదని, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ దుస్తులు ధరించరాదని నిషేధం విధించారు. చక్కగా చీర కట్టుకొని మెడ వరకు బ్లౌజ్ ధరించాలని సూచించారు. కొత్త మేడమ్ ఆదేశాలపై కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు.