మింటూ దొరికాడు
హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూను పోలీసులు అరెస్ట్ చేశారు.
అమృత్‌సర్: నభా జైలు నుంచి ఆదివారం తప్పించుకున్న ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం పంజాబ్, ఢిల్లీ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో మింటూ ఢిల్లీ సరిహద్దులో దొరికాడు.
ఆదివారం ఉదయం పోలీసు దుస్తుల్లో వచ్చిన సాయుధులు జైలు నుంచి మింటూతో పాటు మరో ఐదుగురిని విడిపించుకెళ్లిన విషయం తెలిసిందే. మింటూతో పాటు తప్పించుకున్న ఐదుగురిలో ఉగ్రవాది కశ్మీరా సింగ్ సైతం ఉన్నాడు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పంజాబ్‌తోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కాగా.. ఈ ఘటనకు సూత్రధారి అయిన పర్మిందర్ సింగ్‌ను ఆదివారం యూపీ పోలీసులు అరెస్టు చేశారు. పర్మిందర్ సింగ్ ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మింటూను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.