పాలమూరులో కేరళ వాసులు

Kerala People In Mahabubnagar - Sakshi

ఉమ్మడి జిల్లాలో 2వేల మందికిపైగా కేరళ వాసులు

వరదల నేపథ్యంలో ఆందోళన

ఊర్లు, ఆస్తులు, పంటపొలాలు మునిగిపోయాయని ఆవేదన

దేవభూమి, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లు.. అందాలకు నిలయమైన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. భారీ వరదలు ముంచెత్తడంతో చిగురుటాకులా వణికి పోతోంది. చిరుజల్లులతో పర్యాటకులకు ఆహ్లాదం పంచే మలయాళ సుగంధ మందారం కుంభవృష్టితో గజగజలాడింది. డ్యాములు, నదులు, రిజర్వాయర్లు కలిసి సంద్రంగా మారడంతో కకావికలమైంది.

వరదల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నివాసం ఉంటున్న కొందరు కేరళలో ఉన్న తమ ఆప్తులు, ఆత్మీయులు ఎలా ఉన్నారోనని కలత      చెందుతున్నారు. ఫోన్ల ద్వారా ‘మీరు అక్కడ క్షేమంగా ఉన్నారా.. మన ఊరు ఎలా ఉంది.. మన వాళ్లు ఎక్కుడున్నారు..’ అంటూ యోగక్షేమాలను వాకబు చేస్తున్నారు. మంగళవారం ‘సాక్షి’ పలకరించగా తమ బంధువుల విషాదగాధను పంచుకున్నారు.

ఆత్మకూర్‌ మహబూబ్‌నగర్‌ : కేరళలో సంభవించిన భారీ విపత్తునకు 250 మందికి పైగా చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వవర్గాల అంచనా. సుమారు 7లక్షల మందికిపైగా సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గినా ఎటుచూసినా మోకాళ్ల లోతు నీళ్లు.. పీకల్లోతు కష్టాలు. ఊళ్లకు ఊళ్లే ఏర్లుగా మారాయి. భూలోకస్వర్గంగా పేరొందిన సుందరప్రదేశం మరుభూమిగా మారింది. సర్వం కోల్పోయి ఎంతోమంది ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కేరళ వాసులకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతో సత్సంబంధాలు ఉన్నాయి. వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు ఉపాధి అవకాశాల కోసం పాలమూరులో సుమారు రెండువేల మందికిపైగా స్థిరపడ్డారు.

మధుర స్మృతులు చెదిరాయి..

మా స్వగ్రామం కేరళలోని త్రిశూల్‌ జిల్లా వరకంచి మండల కేంద్రం.. ఉద్యోగం కోసం వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడిపోయాను. మా ఊరి అందాలను గత ఏడాది ఇక్కడి నుంచి తీసుకెళ్లి మా కుటుంబసభ్యులు 25 మందికి చూపించాను. వారం రోజుల పాటు అక్కడే ఎంతో ఎంజాయ్‌గా గడిపాం. ఆ మధుర స్మృతులు మరవకముందే మా ఊరు వరదల్లో మునిగిపోయింది. మా వాళ్లు సాగుచేసిన వరి పైరు, కొబ్బరి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇది విని చాలా బాధపడ్డాను.  

- ఆన్సి శ్రీధర్, ప్రిన్సిపాల్, ఎంవీ.రామన్‌ స్కూల్, ఆత్మకూర్‌

ఊరు ధ్వంసమైంది

మాది కేరళలోని కన్నూర్‌ జిల్లా ఏరోమ్‌ స్వగ్రామం.. వరద ఉధృతి కారణంగా మా ఊళ్లోని రోడ్లు, భవనాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. మా కుటుంబసభ్యులు ఐదెకరాల్లో పండించిన వరి పంట పూర్తిగా కొట్టుకుపోయింది. నాతో పాటు ఇక్కడే ఉంటున్న భార్య, పిల్లలను వారం రోజుల క్రితమే స్వగ్రామానికి పంపించేందుకు టిక్కెట్లు బుక్‌ చేసుకున్నాను. వరదల కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాం.  

- సత్యం, ప్రైవేట్‌ స్కూల్‌ ఉపాధ్యాయుడు, ఆత్మకూర్‌ 

మమ్మల్ని ఆదుకోండి 

కేరళలోని మలప్పురం జిల్లా నిలంబుర్‌ మండల కేంద్రం మాది. మున్సిపాలిటీ కేంద్రమైన మా ఊరు వరదల కారణంగా పూర్తిగా మునిగిపోయింది. ఎంతో సుందరమైన మా ప్రదేశం. రాష్ట్రం మొత్తం వరదల ఉధృతికి అతలాకుతలమైంది. సుమారు రూ.20వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. కేంద్రం ప్రకటించిన రూ.500కోట్లు ఏమూలకు సరిపోవు. మా రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాలు ముందుకు రావడం సంతోషం. ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి మమ్మల్ని ఆదుకోవాలి.  

- సల్మాన్, ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు, ఆత్మకూర్‌

10 మంది చనిపోయారు.. 

కేరళలోని కొట్టాయం జిల్లా చంగరసిరి మండలం త్రికొడ్డితాని స్వగ్రామం.. మా ఊరు పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. నిత్యం ఇక్కడికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అలాంటి మా ఊరు వరదల కారణంగా పూర్తిగా మునిగిపోయింది. మా ఊళ్లో 10మందికి పైగా చనిపోయారు. చేతికొచ్చిన పంటలు పూర్తిగా పోయాయి. మా వాళ్లు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎంతో అందమైన ప్రదేశం పూర్తిగా మునిగిపోవడం ఎంతో బాధగా ఉంది. 

- నిషా, ప్రైవేట్‌ ఉపాధ్యాయురాలు, ఆత్మకూర్‌  

అల్లాడిపోతున్నారు.. 

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా ఉడుంబన్‌ సోలా మండలం నేడుగండం మా స్వగ్రామం. వరదల కారణంగా మా ఊరు పూర్తిగా మునిగిపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాగునీరు, తిండికి మా ఊరివాసులు అల్లాడిపోతున్నారు. ఐదుగురు ఇప్పటికే చనిపోయారు. చాలామందిని సహాయక శిబిరాలకు తరలించారు. ఇంకా కొంతమంది అక్కడే ఉండిపోయారు. వారికి సహాయం అందించి ఆదుకోవాలి.

- లతారాజ్, ప్రైవేట్‌ ఉపాధ్యాయురాలు, ఆత్మకూర్‌

మేమున్నామని..

సాక్షి, వనపర్తి : భారీవర్షాలు, వరదలు భూతల స్వర్గంగా కొనియాడే కేరళను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి సాయం చేసే వనపర్తి జిల్లావాసులు కేరళ ప్రజలకు మేమున్నామని.. సాయం చేసేందుకు ముందుకు కదలిలారు. కేరళ వరద బాధితులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ముంపు నిర్వాసితులను ఆదుకోవాలని కలెక్టర్‌ శ్వేతామహంతి పిలుపునివ్వడంతో పలువురు వ్యాపారులు, ఉద్యోగులు, స్వచ్ఛసంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు. గెజిటెడ్‌ అధికారులు రూ.లక్ష చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ డైరెక్టర్‌ జోషి గోపాలశర్శ రూ.25వేలు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త అమరేందర్‌రెడ్డి రూ.15వేలు అందించారు.  

వరద బాధితులకు ఆర్థిక సాయం  

వనపర్తి : కేరళ, ఆదిలాబాద్‌ వరద బాధితులకు ఆర్థికసాయం చేశారు. మంగళవారం కలెక్టర్‌ శ్వేతామహంతికి చెక్కు అందజేశారు. స్థానిక ప్రజావైద్యశాల తరఫున డాక్టర్‌ మురళీధర్‌ కేరళ వరద బాధితులకు రూ.లక్ష, ఆదిలాబద్, ఆసిఫాబాద్‌ నిర్వాసితులకు రూ.25 వేలు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తరఫున ఆదిలాబాద్‌ బాధితులకు రూ.25వేల ఆర్థిక సాయం అందజేశారు.  ముందుకొస్తున్న దాతలుకేరళ వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లాలో ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు.

సోమవారం కలెక్టర్‌ శ్వేతామహంతిని కలిసి పలువురు చెక్కులు, డీడీలు అందజేశారు. పీడీఎస్‌యూ విద్యార్థులు రూ.7,166, వనపర్తి కలెక్టర్‌ కార్యాలయం ‘ఏ’ సెక్షన్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ రూ.15వేలు, వనపర్తి కల్వరిటౌన్‌ చర్చి ఆధ్వర్యంలో రూ.22వేలు, పురుషుల డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రూ.1,050 కలెక్టర్‌కు అందించారు. వీరితో పాటు పలువురు నేరుగా కేరళ సీఎం రిలీఫ్‌ఫండ్‌కు డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేస్తుండగా మరికొందరు వనపర్తి జిల్లా కలెక్టర్‌ ఖాతాలో నేరుగా డబ్బును జమచేస్తున్నారు. కలెక్టరేట్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ఒక సెల్‌ను ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం అందే అవకాశం ఉంది.

కష్టాల్లో కన్నోళ్లు..

  • ∙పాలమూరులో నర్సింగ్‌  కోర్సు చదువుతున్న కేరళ విద్యార్థులు 
  • ∙క్షణంక్షణం కుటుంబసభ్యుల  యోగక్షేమాలు తెలుసుకుంటున్న వైనం 
  • ∙రాష్ట్రం కోలుకోవాలని నిత్యం ప్రార్థనలు
  • సాయం     కోసం వేడుకోలు

పాలమూరు : ప్రకృతి ప్రకోపానికి సుందర ప్రదేశం కేరళ కాకావికలమైంది. పచ్చటి పొలాలు, ఇళ్లు, ఊళ్లు వరద తాకిడికి నామరూపాల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఎటూచూసినా బురద దిబ్బలే కనిపిస్తున్నాయి.  ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు జిల్లా కేంద్రంలోని నవోదయ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చదువుతున్నారు. కేరళలో నెలకొన్న విషాదం నేపథ్యంలో తమ కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆప్తులను తలచుకుంటూ కుమిలిపోతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయామని కన్నీరుమున్నీరవుతున్నారు. మంగళవారం ‘సాక్షి’తో తమ ఆవేదన పంచుకున్నారు.

మూడురోజులుగా ఆహారం లేదట 

మాది కేరళలోని కొల్లెం జిల్లా కున్నత్తు స్వగ్రామం.. పాలమూరు జిల్లా కేంద్రంలోని నవోదయ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. మా అమ్మ అజిత, తాతయ్య కార్తీకేయ, మా అన్నయ్య అతుల్‌ ఇంటివద్దే ఉంటున్నారు. వారితో ఫోన్‌లో మాట్లాడాను. మూడు రోజుల పాటు ఎలాంటి ఆహారం లేకుండా గడిపారని చెబుతున్నారు. మా ఇంటి రెండో అంతస్తులో విద్యుత్‌ లేకుండా రెండురోజుల పాటు ఉండి ఇతరుల సాయంతో సహాయక శిబిరంలోకి వెళ్లామని చెప్పారు. మూడు రోజులుగా ఫోన్‌ కలవడం లేదు. అందరికీ మంచి జరగాలని ప్రార్థన చేస్తున్నా.. చదువు మీద ధ్యాస ఉండటం లేదు. మేం వెళ్లడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయాను.  

- అతుల్య, బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థి, మహబూబ్‌నగర్‌ 

 కొండచరియలు విరిగి పడ్డాయి  

కేరళలోని ఇడుక్కి జిల్లా ఐడిమాలి స్వగ్రామం మాది. మా అమ్మ షీనా, నాన్న షిబి, సోదరులు స్టిల్‌జో, సిఫినా అక్కడే ఉంటారు. మా ఇంటి సమీపంలో ఉండే కొండచరియలు విరిగిపడ్డాయి. మేం నివాసం ఉండే ప్రాంతం కొండలతో చాలా అందంగా ఉండేది. ప్రస్తుతం అది గుర్తించలేకుండా ఉంది. దీంతో ఇళ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. మా కుటుంబసభ్యులు బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. వారితో మాట్లాడటానికి వీలుపడటం లేదు. ఈ పరిస్థితుల్లో కుటుంబానికి ధైర్యం చెప్పాలని ఉన్నప్పటికీ అక్కడి వాతావరణం బాగా లేకపోవడంతో వెళ్లడం లేదు.  

- సిఫియా, నర్సింగ్‌ విద్యార్థిని

ఫోన్లు కలవడం లేదు.. 

కేరళలోని కొట్టాయం జిల్లా తలయోలసంబు స్వగ్రామం మాది. మా ఇంటి వద్ద నాన్న రాజు, అమ్మ సుధ, అన్నయ్య ఆదర్శ ఉంటున్నారు. మా ఇంటి లోపలికి వరద చేరింది. వాళ్లంతా సహాయక శిబిరాలకు వెళ్లిపోయారు. వారితో మాట్లాడి ఐదు రోజులవుతుంది. పూర్తిగా కరెంట్‌ నిలిచిపోవడంతో సెల్‌ఫోన్లు సైతం పనిచేయడం లేదు. మా కుటుంబసభ్యులు ఎలా ఉన్నారోనని ఆందోళనగా ఉంది. అక్కడ మా వారికి నీరు, ఆహారం ఎలా అందుతుందనే విషయంపై దిగులుగా ఉంది. ప్రస్తుతం కొంత వరకు వర్షాలు తగ్గాయని తెలిసింది. వాతావరణ పరిస్థితి కుదుటపడితే మా ఊరికి వెళ్తాం.  

- అశ్విత, నర్సింగ్‌ విద్యార్థిని 

వరదల్లో మా కుటుంబం  

కేరళలోని పతనంథిట్ల మండలం పందాలం స్వగ్రామం. ఊళ్లో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. మా ఊర్లో అమ్మ పాప్పచన్, నాన్నమ్మ రోసమ్మ, అన్నయ్య మబ్లే, అమ్మమ్మ అన్నమ్మ ఉంటున్నారు. మా కుటుంబం పూర్తిగా వరదల్లో చిక్కుకుపోయింది. స్థానికులు, పోలీసులు బృందాలు రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. రెండు రోజులుగా ఫోన్‌ ట్రై చేస్తున్నా కలవడం లేదు. వారు ప్రస్తుతం ఎలా ఉన్నారనే సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్నాను. మా కుటుంబంతో పాటు స్థానికులు బాగుండాలని మేం ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నాం. 

- మెర్లీన్, నర్సింగ్‌ విద్యార్థిని 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top