మద్యం అమ్మకాలపై హైకోర్టు స్టే

Kerala HC Stays State Govt Order Allowing Supply Of Alcohol - Sakshi

తిరువనంతపురం : కేరళ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్‌ ఇచ్చింది. మద్యం అమ్మకాలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. మద్యం అమ్మకాలపై మూడు వారాల పాటు స్టే విధిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జయశంకర్‌ నంబియార్‌, శజ్జీ పీ చాలేతో కూడిన ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తీర్పును వెలువరించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరపొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా దేశంలో కరోనా వైరస్‌ విజృభిస్తున్న తరుణంలో ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వడం సరికాదంటూ కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపడుతూ.. న్యాయస్థానం స్టే విధించింది. 

కాగా దేశ వ్యాప్త లాక్‌డౌన్‌​ కారణంగా మద్యం దుకాణాలు మూసి వేయడంతో మందుబాబులు మద్యం కోసం అల్లాడుతున్నారు. మందు దొరక్క ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు దేశ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, కేరళలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మందు బాబుల ఆర్తనాదాలు విన్న కేరళ ప్రభుత్వం  మద్యం కావాల్సిన వాళ్లు వైద్యుడి దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ లెటర్‌ తీసుకు వచ్చిన వారికి అనుమతి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆన్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ మద్యం సరఫరా చేసే విధంగా కూడా కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై మందుబాబులు తీవ్ర నిరాశ చెందారు. (మందుబాబులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top