కార్తీకి ఐదు రోజుల కస్టడీ

Karti Chidambaram to remain in CBI custody till March 6 - Sakshi

కార్తీ విదేశాలకెళ్లి అక్కడి అకౌంట్లను క్లోజ్‌ చేశారు

దీనిపై ఆశ్చర్యపోయే సాక్ష్యాలున్నాయి: సీబీఐ తరఫు న్యాయవాది

కుట్రను బయటపెట్టే ఆధారాలను సంపాదించండి: న్యాయమూర్తి

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కార్తీ చిదంబరంను ఐదురోజుల సీబీఐ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. కార్తీకి సంబంధించి ఈ కేసుల్లో ఆశ్చర్యకర సాక్ష్యాలున్నాయని వీటిని రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ విజ్ఞప్తి మేరకు మార్చి 6 వరకు కార్తీ కస్టడీని పొడిగిస్తున్నట్లు ప్రత్యేక కోర్టు జడ్జి సునీల్‌ స్పష్టం చేశారు.

కార్తీ విదేశాలకు వెళ్లి అక్రమ నిధులు దాచుకున్న వివాదాస్పద బ్యాంకు అకౌంట్లను క్లోజ్‌ చేశారని, దీనికి సంబంధించి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఆధారాలున్నాయని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఒకరోజు కస్టడీ ముగియటంతో సీబీఐ గురువారం ప్రత్యేక కోర్టుముందు కార్తీని ప్రవేశపెట్టింది. ఈ సమయంలో చిదంబరం, ఆయన భార్య నళిని (ఇద్దరూ సీనియర్‌ లాయర్లే) కోర్టు హాల్లో ఉన్నారు. వీరిద్దరూ కార్తీతో కాసేపు మాట్లాడారు.  

కుట్రను బయటపెట్టండి: జడ్జి 
కార్తీ కస్టోడియల్‌ విచారణ ద్వారా ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకు సంబంధించిన భారీ కుట్ర బయటపెట్టాలని జడ్జి సీబీఐకి సూచించారు. సీబీఐ చూపించే దస్తావేజులు, సహ నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాలతో కార్తీ అసలు విషయాన్ని అంగీకరించేందుకు ఈ కస్టడీ అవసరమన్నారు. కేసు డైరీ, రోజువారీ నివేదికల ఆధారంగా ఈ కేసు ఇప్పుడు కీలకదశలో ఉందని.. విచారణ ద్వారా మరిన్ని విషయాలు బయటపడే∙అవకాశం ఉన్నందునే కస్టడీ పొడిగించినట్లు జడ్జి తెలిపారు. సీబీఐ కస్టడీ సందర్భంగా న్యాయవాది సహకారం (రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో గంట చొప్పున) తీసుకునేందుకు కార్తీకి స్వేచ్ఛ కల్పించాలని ఆదేశించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుపై ఎఫ్‌ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతులను విచారించిన ఆర్బీఐ మాజీ గవర్నర్‌ సుబ్బారావు కమిటీ ముందు కార్తీ పలువురు సహనిందితులు పేర్కొన్న విషయాలను అంగీకరించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. 

రాజకీయ దురుద్దేశం లేదు 
సీబీఐ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ వాదిస్తూ.. ‘ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన అరెస్టు కాదు. ఆర్టికల్‌ 21 ప్రకారమే విచారణ జరుగుతోంది. విదేశాలకు వెళ్లి కార్తీ చిదంబరం ఏం చేశాడో తెలిపే ఆశ్చర్యకర సాక్ష్యాలున్నాయి’ అని జడ్జికి తెలిపారు. కార్తీ సాధారణ మెడికల్‌ చెకప్‌ సందర్భంగా ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయనప్పటికీ బుధవారం  సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలోని కార్డియాక్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స చేశారు. తర్వాతే గురువారం సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. హాస్పిటల్‌లో చేర్చినందున కార్తీ ఒకరోజు కస్టడీ వృధా అయ్యిందికనుకే కస్టడీని పొడిగించాలని జడ్జిని కోరారు. కార్తీ తరపున వాదిస్తున్న అభిషేక్‌ సింఘ్వీ.. ‘గతేడాది మేలో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఆయన్ను 22 గంటలపాటు విచారించిన సీబీఐ ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయింది.  సహకరించటం లేదనే కారణంతోనే అరెస్టు చేస్తారా? ఇది దారుణం’ అని అన్నారు.  

మెహుల్‌ చోక్సీకి మేలుచేసేలా.. 
చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన 80:20 బంగారు దిగుమతి పథకం ద్వారా చాలా మంది బంగారు, వజ్రాభరణాల వ్యాపారులు అక్రమాలకు పాల్పడ్డారని పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీలోని బీజేపీ సభ్యులు ఆరోపించారు. పీఎన్‌బీ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న మెహుల్‌ చోక్సీ మనీలాండరింగ్‌ కేసూ ఇందులో భాగమేనన్నారు. గురువారం రెవెన్యూ కార్యదర్శి, ఈడీ ఉన్నతాధికారులు, ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ), ఎక్సైజ్, కస్టమ్స్‌ కేంద్ర మండలి (సీబీఈసీ)ల అధికారులు పీఏసీ సబ్‌ కమిటీ ముందు హాజరయ్యారు. యూపీఏ ప్రభుత్వం 2013లో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా దేశ ఖజానాకు రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లిందంటూ.. 2016లో కాగ్‌ ఇచ్చిన నివేదికపై వీరు చర్చించారు. ఈ పథకంలో భాగంగా వజ్రాల వ్యాపారులు ఒక డాలర్‌ సంపాదించేందుకు ప్రభుత్వం సుంకం రూపంలో రూ.221.75 చెల్లించింది. దీని ద్వారా దేశం నుంచి నల్లధనం బయటకెళ్లి వైట్‌ మనీగా తిరిగొచ్చిందని వారన్నారు.  
కోర్టు బయట కార్తీ. కోర్టుకు వస్తున్న కార్తీ తల్లిదండ్రులు నళిని, చిదంబరం

విచారణ లిస్టులో  చిదంబరం 
కార్తీతోపాటు చిదంబరం సీబీఐ, ఈడీ విచారణ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌సెల్‌–మ్యాక్సిస్‌ ఒప్పందంలో విదేశీ పెట్టుబడుల ఒప్పందానికి అనుమతివ్వటంలో చిదంబరం పాత్ర ఉందని సీబీఐ వాదిస్తోంది. కాగా, ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు సంబంధించి మే 2007లో ఎఫ్‌ఐపీబీ ఇచ్చిన అనుమతులు తర్వాతి పరిణామాలపై కార్తీ ఏవిధంగా ఒత్తిడితెచ్చారనే అంశాన్ని విచారిస్తున్నామని సీబీఐ తెలిపింది. ‘మా దగ్గర కార్తీ చిదంబరానికి చెందిన అడ్వాంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి నిధులు బదిలీ అయినట్లు పేర్కొనే ఈ–మెయిల్స్, బిల్లులు ఉన్నాయి. కార్తీని దోషిగా నిలబెట్టేందుకు అవసరమైన సాక్ష్యాలున్నాయి. ఈయన నుంచి స్వాధీనం చేసుకున్న మూడు మొబైల్‌ ఫోన్లను పరిశీలిస్తున్నాం. వీటన్నింటికోసం కనీసం 14రోజుల కస్టడీ అవసరం’ అని మెహతా కోర్టును కోరారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top