సన్నీకి మద్దతుగా హైకోర్టు వ్యాఖ్యలు

Karnataka High Court Bats for Sunny Leoene - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : సన్నీ నైట్‌ షోపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వేళ.. పోలీసులు అనుమతి నిరాకరించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సన్నీ షోను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బెంగళూర్‌ పోలీసులను ప్రశ్నించింది. 

భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ పోలీసులు అనుమతి నిరాకరించటంతో  షో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న 18 రోజుల తర్వాత నిరాకరిస్తున్నట్లు చెప్పటం, అది కూడా భద్రతా కారణం అని చెప్పటం సహేతుకంగా లేదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.  దీంతో పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. 

కొత్త సంవత్సరం వేడుకల విషయంలో మిగతా క్లబ్‌ ఈవెంట్లపై లేని అభ్యంతరాలు కేవలం సన్నీలియోన్‌ షోపై మాత్రమే ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించింది. ఈ విషయంలో సన్నీ లియోన్‌ నుంచి స్పష్టమైన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని.. డిసెంబర్‌ 31న నగరంలో ఎవరెవరికి అనుమతులు ఇచ్చారో జాబితా ను అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని న్యాయమూర్తి బీ వీరప్ప ఆదేశించారు. తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేశారు.

అనంతరం షో నిర్వాహకుడు, ది టైమ్స్‌ క్రియేషన్స్‌ యజమాని భవ్య హెచ్‌ఎస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌ ఏర్పాట్ల కోసం సుమారు 2.5 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు వివరించారు.  దరఖాస్తు చేసుకున్న సమయంలో నాలుగైదు రోజుల్లో అనుమతులు ఇస్తామని పోలీస్‌ శాఖ చెప్పిందని.. ఇప్పుడు అభ్యంతరాల నేపథ్యంలో షో రద్దైతే తనకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఆయన తెలిపారు. 

కాగా, కర్ణాటక రక్షణ వేదిక యువ సేనే అభ్యంతరాల నేపథ్యం, సామూహిక ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసులు అనుమతులకు వెనకడుగు వేస్తుండగా.. సన్నీ లియోన్‌ కూడా స్వచ్ఛందంగా షోకు రావట్లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top