ఆ 20మందిలో ఏ ఒక్కరూ మళ్లీ గెలవరు!

Kapil Mishra internal survey report on Disqualified MLAs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు ప్రకటించిన 20 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు కూడా తిరిగి గెలవబోరని ఆప్‌ ఎమ్మెల్యే(రెబల్‌) కపిల్‌ మిశ్రా చెబుతున్నాడు. ఉప ఎన్నికలకు వెళ్తే.. వారంతా చిత్తుగా ఓడిపోవటం ఖాయమని అంటున్నాడు. అంతర్గత సర్వేలో ఈ విషయం తేటలెల్లమైందన్న ఆయన.. ఇందుకు సంబంధించిన నివేదికను శనివారం మీడియాకు విడుదల చేశాడు.

‘‘అంతర్గత సర్వే నిర్వహించి నివేదికను తయారు చేశాం. ఆ 20 మందిపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ‘ఎమ్మెల్యేల పనితీరు.. ప్రజల్లో వారిపై ఏ మేర వ్యతిరేకత’ ఉంది అన్న విషయాలను నివేదికలో స్పష్టంగా పేర్కొన్నాం. వారు తిరిగి గెలిచే అవకాశాలే లేవు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిగితే 11 స్థానాల్లో ఆప్‌ అభ్యర్థుల ఓటమి ఖాయం. 9 స్థానాల్లో ఒకవేళ అభ్యర్థులను మార్చినా లాభం లేకపోవచ్చు’’ అని కపిల్‌ పేర్కొన్నారు. కపిల్‌ సూచించిన స్థానాల మార్పుల్లో అల్కా లాంబ, ఆదర్శ్‌ శాస్త్రి, సరితా సింగ్‌, ప్రవీణ్‌ దేశ్‌ముఖ్‌ పేర్లు ప్రముఖంగా ఉన్నాయని తెలుస్తోంది.

కారావాల్‌ నగర్‌ ఎమ్మెల్యే అయిన కపిల్‌ మిశ్రా గత కొంత కాలంగా ఆప్‌ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికీ ఎన్నికల సంఘం అనర్హత వేటు ప్రకటన వెలువడగానే అంతర్గత సర్వేను ప్రారంభించేశాడు. సోషల్‌ మీడియా ద్వారా ఆయా నియోజక వర్గాల్లో ప్రజల అభిప్రాయలను సేకరించిన కపిల్‌.. ఆ నివేదికను రాత్రికి రాత్రే ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అందజేశాడు.

 

         మీడియాతో కపిల్‌ మిశ్రా (పాత చిత్రం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top