మధ్యప్రదేశ్‌కు కమలనాథుడే 

Kamal Nath as the new chief minister of Madhya Pradesh - Sakshi

సీఎంగా కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక 

నేడు రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులపై నిర్ణయం

రాహుల్‌ నివాసంలోరోజంతా చర్చోపచర్చలు... 

రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల నిరసనలు, స్వల్ప హింస  

సాక్షి, ప్రతినిధి, న్యూఢిల్లీ: సుదీర్ఘ చర్చల అనంతరం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడింది. ఫలితాలు విడుదలైన దాదాపు 24 గంటల అనంతరం కీలక రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ పీఠంపై కూర్చోనున్నది ఎవరో తేలింది. తీవ్ర ఉత్కంఠ అనంతరం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేసింది. ఊహాగానాలకు తెరదించుతూ గురువారం అర్ధరాత్రి సమయంలో పార్టీ ట్వీటర్‌ హ్యాండిల్‌లో మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథేనంటూ స్పష్టత ఇచ్చింది. దాంతో భోపాల్, తదితర మధ్యప్రదేశ్‌ నగరాల్లో కమల్‌నాథ్‌ అభిమానాలు బాణాసంచాతో సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందే కమల్‌ నాథ్, యువ నేత జ్యోతిరాదిత్య సింధియాలు భోపాల్‌ చేరుకున్నారు.  శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కమల్‌నాథ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ను కలవనున్నారు.  

మరోవైపు, రాజస్తాన్‌ విషయంలోనూ పార్టీ అగ్ర నాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. సీఎం రేసులో ఉన్న సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్, యువ నాయకుడు సచిన్‌ పైలట్‌ తమ పట్టు వీడకపోవడంతో నిర్ణయం తీసుకోవడం పార్టీ చీఫ్‌ రాహుల్‌కి కత్తి మీద సాములా మారింది. ఈ రెండు రాష్ట్రాల సీఎం ఎంపికే ఒక కొలిక్కి రాకపోవడంతో.. చత్తీస్‌ గఢ్‌ ముఖ్యమంత్రి ఎంపికను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, తమ అభిమాన నేతనే సీఎంగా ప్రకటించాలంటూ పలు చోట్ల కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో రాజస్తాన్‌లో స్వల్ప హింస చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడి దాదాపు 2 రోజులు గడుస్తున్నా సీఎం ఎంపిక పూర్తి కాకపోవడంపై బీజేపీ నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. 

సీఎం పదవికి రేసు ఏదీ లేదు: సింధియా 
ప్రజలకు సేవ చేసేందుకే తాము ఉన్నామనీ, సీఎం పదవి కోసం పరుగుపందెం ఏదీ జరగడం లేదని రాహుల్‌తో చర్చల అనంతరం జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రాహుల్‌తో సింధియా, కమల్‌నాథ్‌లు విడివిడిగా భేటీ అయిన అనంతరం ఇరువురితో కలిసి రాహుల్‌ ఫొటో తీసుకుని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘కాలం, ఓరిమి.. ఇవే అత్యంత శక్తిమంతమైన యోధులు’ అనే ప్రఖ్యాత రచయిత లియొ టాల్‌స్టాయ్‌ వ్యాఖ్యను  ట్వీట్‌తో జతపరిచారు.
 
రాజస్తాన్‌ నిరసనల్లో హింస 
తమ అభిమాన నాయకుడినే సీఎంగా ప్రకటించాలంటూ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ కార్యాలయాలు సహా పలుచోట్ల ఆందోళనలకు దిగారు. సచిన్‌ మద్దతుదారులు ఢిల్లీలో రాహుల్‌ నివాసం బయట నినాదాలు చేశారు.  రాజస్తాన్‌లో పార్టీ కార్యకర్తల నిరసనల్లో స్వల్ప హింస చెలరేగింది. దౌసా, అజ్మీర్, కరౌలీ ప్రాంతాల్లో సచిన్‌ పైలట్‌ మద్దతుదారులు రోడ్లపై వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. సంయమనంతో ఉండాలని సచిన్‌తోపాటు గెహ్లోత్‌ కార్యకర్తలను కోరారు. రాహుల్, సోనియాలపై నమ్మకం ఉందనీ, కార్యకర్తలు సంయమనంతో ఉండాలని పైలట్‌ తన వర్గం వారిని కోరారు.

ఛత్తీస్‌గఢ్‌పై నిర్ణయం నేడు 
ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎంపిక నేటికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ ముఖ్యమంత్రుల ఎంపికలో తలమునకలైన కాంగ్రెస్‌ అగ్రనేతలు.. చత్తీస్‌గఢ్‌ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారని సమాచారం. అయితే, రాష్ట్రంలో పార్టీ పరిశీలకుడు మల్లిఖార్జున్‌ ఖర్గే పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను, రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితిని వివరిస్తే రూపొందించిన తన నివేదికను పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి అందించారు. చత్తీస్‌గఢ్‌లో పీసీసీ అధ్యక్షుడు భూపేశ్‌ బఘేల్, ఓబీసీ నేత తామ్రధ్వజ్‌ సాహు, సీనియర్‌ నేతలు టీఎస్‌ సింగ్‌ దేవ్, చరణ్‌సింగ్‌ మహంత్‌లు సీఎం రేసులో ఉన్నారు. 15 ఏళ్లుగా అధికారంలో లేకపోయినా.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసిన బఘేల్‌కే సీఎం పీఠం దక్కే చాన్సుంది.

1984 అల్లర్లలో పాత్రపై ఆరోపణలు
మధ్యప్రదేశ్‌ సీఎంగా కమల్‌నాథ్‌ను ఎంపిక చేయడం ద్వారా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితులను కాంగ్రెస్‌ పార్టీ రక్షిస్తోందని శిరోమణి అకాలీదళ్‌ నేత మంజీందర్‌ సింగ్‌ సిర్సా ఆరోపించారు. ‘గాంధీ కుటుంబం అధికారంలో ఎప్పుడొచ్చినా 1984 అల్లర్ల నిందితులను కాపాడుతుంది. ఇప్పుడు కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్‌కు సీఎంను చేయడం ద్వారా ఆయనకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కానుక ఇస్తున్నారు’ అని మంజీందర్‌ అన్నారు. సిక్కు వ్యతిరేక అల్లర్లలో కమల్‌నాథ్‌ పాత్ర కూడా ఉందని అకాలీదళ్‌ గతం నుంచీ ఆరోపిస్తోంది. ‘సిక్కు వ్యతిరేక అల్లర్లలో అమాయకుల ప్రాణాలు తీసినవారు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని రాహుల్‌ సందేశమిస్తున్నారు. ఆ ఘాతకుల వెనుక తాము ఉన్నామనీ, సిక్కులను చంపినందుకు బహుమతులు ఇస్తామని ఆయన అంటున్నారు’ అని మంజీందర్‌ అన్నారు.

గతంలో కమల్‌నాథ్‌ను పంజాబ్, హరియాణాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పుడూ పలువురు సిక్కులు వ్యతిరేకించడంతో ఆయనను అప్పట్లో పంజాబ్‌ బాధ్యతల నుంచి తప్పించారు. అలాగే సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ హస్తం ఉందనేందుకు తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని సుప్రీంకోర్టు లాయర్‌ హెచ్‌ఎస్‌ ఫూల్కా కూడా తెలిపారు. ‘కమల్‌నాథ్‌కు వ్యతిరేకంగా అవసరమైనన్ని సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయి. అయితే, చట్టం ముందు ఆయన నిలబడాల్సిన సమయం ఇంకా ఆసన్నం కాలేదు. కానీ, ఇటువంటి వ్యక్తిని మధ్యప్రదేశ్‌ సీఎంగా నియమించాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది రాహుల్‌ గాంధీనే’ అని అల్లర్ల బాధితుల పక్షాన వాదిస్తున్న ఫూల్కా అన్నారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం 1984లో ఢిల్లీలో సిక్కులు ఊచకోతకు గురవడం తెలిసిందే.

ఉదయం నుంచి ఉత్కంఠ 
మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ ముఖ్యమంత్రుల ఎంపిక కోసం చర్చలు, సంప్రదింపుల ప్రక్రియను కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ గురువారం ఉదయమే ప్రారంభించారు. ఇందుకు గాను ఆయా రాష్ట్రాల సీఎం ఆశావహులతో పాటు, పార్టీ పరిశీలకులు, సీనియర్‌ నేతలను ఢిల్లీకి పిలిపించారు. రాహుల్‌కు సహాయంగా ఆయన తల్లి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, రాహుల్‌ సోదరి ప్రియాంక వాద్రా కూడా చర్చల్లో పాల్గొన్నారు. రాహుల్‌ నివాసంలో జరిగిన ఈ చర్చల్లో మధ్యప్రదేశ్‌ సీఎం అభ్యర్థులుగా ఉన్న కమల్‌ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలతో.. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న అశోక్‌ గహ్లోత్, సచిన్‌ పైలట్‌లతో ఉమ్మడిగా, వేర్వేరుగా చర్చలు జరిపారు. యువ నేతలైన సింధియా, పైలట్‌ల వైపు రాహుల్, ప్రియాంక మొగ్గుచూపగా..అనుభవాన్ని, 2019 లోక్‌సభ ఎన్నికల అవసరాన్ని పరిగణనలోకి తీసుకున్న సోనియా గాంధీ సీనియర్లైన కమల్‌ నాథ్, గహ్లోత్‌లకు మద్దతిచ్చినట్లు సమాచారం.

మధ్యప్రదశ్‌ విషయంలో కమల్‌నాథ్‌ను సీఎంగా అంగీకరించేలా జ్యోతిరాదిత్య సింధియాను రాహుల్, ప్రియాంకలు ఒప్పించారని, సచిన్‌ పైలట్‌ మాత్రం గహ్లోత్‌ను ముఖ్యమంత్రిగా నియమించడాన్ని తీవ్రంగా నిరసించాడని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మధ్యప్రదేశ్‌ సీఎంగా కమల్‌ నాథ్‌ ఎంపికను ఖరారు చేసిన రాహుల్‌.. రాజస్తాన్‌ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. ఉదయం నుంచి పలు దఫాలుగా జరిగిన చర్చల్లో రాజస్తాన్‌కు కాంగ్రెస్‌ కేంద్ర కమిటీ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్, ఆ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ అవినాశ్‌ పాండే, మధ్యప్రదేశ్‌ కేంద్ర పరిశీలకుడు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున్‌ ఖర్గే తదితర సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top