వివాదంలో మరో విశ్వవిద్యాలయం | Sakshi
Sakshi News home page

వివాదంలో మరో విశ్వవిద్యాలయం

Published Wed, Jan 27 2016 11:33 AM

వివాదంలో మరో విశ్వవిద్యాలయం

న్యూఢిల్లీ: హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్  ఆత్మహత్య  వివాదం ఇంకా చల్లారకముందే   దేశ రాజధాని లో ప్రముఖ యూనిర్శిటీ వార్తల్లో నిలిచింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకుంటానని  బెదిరించడం  కలకలం రేపింది. తన సమస్యను వారంలోగా తేల్చాలని ...లేకుంటే ప్రాణత్యాగం చేస్తానని బెదిరిస్తూ  యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ను ఉద్దేశించి  రెండు లేఖలు రాశాడు.

తనకు రావాల్సిన  గ్రాంట్ ను మంజూరు చేయకుండా  వివక్షను గురి చేసి,  వేధిస్తున్నారని  దళిత  స్కాలర్ మదన్ మెహర్ ఆరోపిస్తున్నాడు.  తన పీహెచ్డీని ఆపివేశారని ఆవేదన  వ్యక్తం చేశాడు.  నిలిపి వేసిన తన ఫెలోషిప్ను తక్షణమే కొనసాగించాలని అతడు డిమాండ్ చేశాడు.   వారంలోగా తన సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ లేఖలో తెలిపాడు.

అయితే యూనివర్శిటీ  వాదన దీనికి భిన్నంగా ఉంది.  సదరు విద్యార్థి  బ్రస్సెల్స్, బెల్జియంలో పర్యటన కోసం అడ్వాన్స్గా తీసుకున్న  రూ 66,000 ను  యూనివర్శిటీకి తిరిగి  చెల్లించాల్సింది  ఉందన్నారు. విద్యార్ధి తన ఫెలోషిప్ కొనసాగించడానికి అనుమతించే  ముందు, ఆ మొత్తం డబ్బులను తిరిగి ఇవ్వాల్సి ఉంటుదని  వైస్ ఛాన్సలర్ హెచ్. శర్మ బుధవారం  పేర్కొన్నారు.  వర్శిటీ కంట్రోలర్, ఫైనాన్స్ అధికారి నుంచి అనుమతి లేకపోవడంతోనే  సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొడిగింపును నిలిపి వేసినట్టు చెప్పారు.

 

మరోవైపు విద్యార్థిని ఒక కంట కనిపెట్టమని  యూనివర్శిటీ భద్రతా అధికారిని అప్రమత్తం చేశామని, సమస్యను త్వరలోనే   పరిష్కరిస్తామని మరో అధికారి  హామీ ఇచ్చారు. మరోవైపు సమస్యలపై వర్సిటీ అధికారులు ఫిబ్రవరి 8న  విద్యార్థులతో భేటీ కానుంది. కాగా జనవరి 17 న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో రోహిత్(26)  హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement