
యువత సాధికారతకు కట్టుబడి ఉన్నాం
దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యం పెంచుతాం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పషీ్టకరణ
రోజ్‌గార్ మేళాలో 51 వేల మందికి నియామక పత్రాల పంపిణీ
సాక్షి, న్యూఢిల్లీ: యువత సాధికారతకు, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువశక్తి, అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశానికి ఉన్నాయని, ఇవే మనకు అసలైన బలం అని తెలిపారు. యువశక్తి దేశానికి అత్యంత విలువైన మూలధనమని స్పష్టం చేశారు.
శనివారం దేశవ్యాప్తంగా 47 నగరాల్లో నిర్వహించిన రోజ్‌గార్ మేళాల్లో ప్రధాని మోదీ వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన యువతకు 51 వేలకు పైగా నియామక పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. పారదర్శకమైన నియామక ప్రక్రియకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని లక్షలాది మంది యువత రోజ్‌గార్ మేళాల ఉద్యోగాలు పొందారని, నేడు జాతి నిర్మాణంలో వారంతా పాలుపంచుకుంటున్నారని హర్షం వ్యక్తంచేశారు. గత 11 ఏళ్లుగా దేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని వ్యాఖ్యానించారు.
దేశానికి సేవ చేయడమే ఉమ్మడి లక్ష్యం
రోజ్‌గార్ మేళాలు సద్వినియోగం చేసుకొని, కొలువులు పొందిన యువతీ యువకులు రాబోయే రోజుల్లో దేశ అభివృద్ధి వేగాన్ని మరింత వేగవంతం చేస్తారని ప్రధాని మోదీ వివరించారు. కొందరు దేశాన్ని రక్షిస్తారని, మరికొందరు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’లక్ష్యానికి నిజమైన సైనికులుగా మారతారని పేర్కొన్నారు. యువత వేర్వేరు విభాగాల్లో నియమితులైనప్పటికీ దేశానికి సేవ చేయడమే వారి ఉమ్మడి లక్ష్యమని ఉద్ఘాటించారు. ‘పౌరులే ప్రథమం’అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు సిఫార్సులు లేదా లంచం లేకుండా, సామర్థ్యం ఆధారంగా మాత్రమే పొందవచ్చనే విశ్వాసాన్ని రోజ్‌గార్ మేళాలు సృష్టించాయని చెప్పారు.
The Rozgar Mela reflects our Government’s commitment to empowering the Yuva Shakti and making them catalysts in building a Viksit Bharat. https://t.co/2k3WDTVnJc
— Narendra Modi (@narendramodi) July 12, 2025
ఉద్యోగాల స్వభావం మారుతోంది
ప్రస్తుత శతాబ్దంలో ఉద్యోగాల స్వభావం వేగంగా మారుతోందని, ఈ క్రమంలోనే స్టార్టప్ కంపెనీలు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మోదీ చెప్పారు. ఇవన్నీ యువత గొప్ప ఆశయాలతో ముందుకు రావడానికి దోహదం చేస్తున్నాయని, ఈ కొత్త తరంపై తనకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. యువత కోసం ప్రైవేట్ రంగంలో నూతన ఉపాధి అవకాశాల సృష్టికి ఎంతగానో కృషి చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు రక్షణ తయారీ రంగంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందని, రూ.1.25 లక్షల కోట్లకుపైగా ఉత్పత్తిని సాధించిందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైలింజన్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవించిందని వెల్లడించారు. రైలింజన్లు, రైలు కోచ్‌లు, మెట్రో కోచ్‌ల ఎగుమతిలో భారత్ పురోగతి సాధిస్తోందన్నారు.
ఇప్పటికే 1.5 కోట్ల ‘లఖ్‌పతి దీదీలు’
‘నమో డ్రోన్ దీదీ’కార్యక్రమం గ్రామీణ మహిళలకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చి, సాధికారత కల్పించిందని ప్రధానమంత్రి తెలిపారు. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారి దీదీలుగా మార్చే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని, ఇప్పటికే 1.5 కోట్ల మంది మహిళలు ‘లఖ్‌పతి దీదీ’లుగా సాధికారత సాధించారని వివరించారు.