
ఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ (AAIB) ఇచ్చిన ప్రాథమిక నివేదికపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు. తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. అలాగే, బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. విమాన ప్రమాదంపై ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. మంత్రిత్వ శాఖలో దీనిపై మేం విశ్లేషిస్తున్నాం. విమాన ప్రమాదంపై అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు. నివేదికపై మేము వారితో సమన్వయం చేసుకుంటున్నాం. తుది నివేదికలు త్వరలో వస్తాయని మేము ఆశిస్తున్నా. అనంతరం, ఒక నిర్ణయానికి వచ్చే వీలు ఉంటుంది. పైలట్లు, సిబ్బంది పరంగా ప్రపంచంలో మనకు అత్యంత అద్భుతమైన శ్రామిక శక్తి ఉంది. ఇది నేను నిజంగా నమ్ముతున్నాను. పైలట్లు, సిబ్బందే విమానయాన పరిశ్రమకు వెన్నెముక’ అని చెప్పుకొచ్చారు.
#WATCH | Vizag | On AAIB's preliminary report on AI 171 crash, Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu says, "This is a preliminary report, at the ministry we are analysing it...We are coordinating with AIBB for any support they need. We are hoping that the final… pic.twitter.com/UsJB7yD1Xj
— ANI (@ANI) July 12, 2025
ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో.. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.
క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే క్రాష్‌ల్యాండ్ అయినట్టు తెలిపింది. ఈ మేరకు కాక్‌పిట్ వాయిస్‌లో పైలట్ సంభాషణ రికార్డు అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది.