
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్ వేస్ విమానం ఒకటి పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. విమానం నడుపుతున్న ఇద్దరు సీనియర్ పైలట్లు విమానం గాల్లో ఉండగానే తన్నుకోవడం మొదలుపెట్టారు. కాక్‌పీట్‌లోనే వారు ఒకరితో ఒకరు గొడవపడి దెబ్బలాడుకున్నారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకుండానే చివరకు విమానాన్ని జాగ్రత్తగా కిందికి దించారు. ఈ సంఘటన జనవరి 1న లండన్ నుంచి ముంబయి మధ్య నడిచే జెట్ ఎయిర్ వేస్ విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోయింగ్ 777 విమానం 324మంది ప్రయాణీకులు, 14మంది సిబ్బందితో బ్రిటన్ కాలమానం ప్రకారం జనవరి 1న ఉదయం పదిగంటలకు నూతన సంవత్సరం రోజే ముంబయికి బయలు దేరింది.
మొత్తం తొమ్మిదిగంటలపాటు సాగే ఈ ప్రయాణం మధ్యలో విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత ఇద్దరు పైలట్లకు గొడవ అయింది. కాక్‌పీట్ కెప్టెన్ కోపైలట్‌ను చెంపచెల్లుమనిపించాడు. దీంతో ఆమె ఏడుస్తూ కాక్‌పీట్ నుంచి బయటకొచ్చింది. కిచెన్‌లోకి వెళ్లి బోరుమని ఏడ్వడం ప్రారంభించింది. అయితే, ఇతర సిబ్బంది ఆమెను ఓదార్చి తిరిగి కాక్‌పీట్‌లోకి పంపించారు. అప్పటికే కెప్లెన్ కూడా ఆమెను కాక్‌పీట్‌లోకి పంపించాలని సిబ్బందిని పదేపదే కోరినట్లు సమాచారం. అనంతరం కూడా వారిద్దరు తీవ్రంగా మరోసారి గొడవపడటం అసలు కాక్‌పీట్‌ను ఇద్దరు వదిలేయడం జరిగింది. దీంతో కోపైలెట్ మరోసారి అందులోకి వెళ్లేందుకు నిరాకరించగా ప్రయాణీకులను సురక్షితంగా చేర్చాలన్న సిబ్బంది వేడుకోలు మేరకు ఆమె అంగీకరించింది. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ గొడవను జెట్ ఎయిర్ వేస్ అధికారులు కూడా ధ్రువీకరించారు. వారిద్దరి మధ్య సమాచార బదిలీ లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడినట్లు ప్రాథమికంగా తెలిపారు.