ఆపరేషన్, అబార్షన్... అంతా బీజేపీ | 'jds' support to Congress candidate | Sakshi
Sakshi News home page

ఆపరేషన్, అబార్షన్... అంతా బీజేపీ

Aug 14 2014 4:55 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఆపరేషన్, అబార్షన్... అంతా బీజేపీ - Sakshi

ఆపరేషన్, అబార్షన్... అంతా బీజేపీ

ఆపరేషన్ లేదా అబార్షన్... ఇదంతా బీజేపీకి చెందిన పరిణామాలని, కాంగ్రెస్‌కు వీటి గురించే తెలియదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు.

- సీఎం సిద్ధరామయ్య
 - కాంగ్రెస్ అభ్యర్థికి ‘జేడీఎస్’ మద్దతు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు/శివమొగ్గ : ఆపరేషన్ లేదా అబార్షన్... ఇదంతా బీజేపీకి చెందిన పరిణామాలని, కాంగ్రెస్‌కు వీటి గురించే తెలియదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. శివమొగ్గ జిల్లా శికారిపురలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడిన సందర్భంలో, ‘ఆపరేషన్ హస్తం’ జరుగుతోందా అని అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. శికారిపురకు చెందిన జేడీఎస్ నాయకుడు హెచ్‌టీ. బళిగార కాంగ్రెస్ అభ్యర్థికి పరోక్ష మద్దతును ప్రకటించారని తెలిపారు. జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు, సొరబ ఎమ్మెల్యే మధు బంగారప్పతో కూడా దీనిపై చర్చిస్తున్నామని  వెల్లడించారు.

జేడీఎస్ మద్దతు వల్ల కాంగ్రెస్‌కు అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన కుమారుని ఎమ్మెల్యే చేయాలనే ఏకైక లక్ష్యం వల్ల ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థి శాంత వీరప్ప గౌడ పట్ల ఓటర్లలో ఉత్తమ స్పందన వ్యక్తమవుతోందని తెలిపారు. ఈ నియోజక వర్గం నుంచి యడ్యూరప్ప ఎన్నో ఏళ్లుగా గెలుస్తూ వస్తున్నప్పటికీ, లంబాడీ తాండాల అభివృద్ధి చెందలేదని ఆరోపించారు.
 
జేడీఎస్ నాయకులకు కాంగ్రెస్ గాలం : రాష్ర్టంలోని మూడు శాసన సభ స్థానాలకు ఈ నెల 21న జరుగనున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికార కాంగ్రెస్ స్థానిక జేడీఎస్ నాయకులకు గాలం వేస్తోంది. బళ్లారి గ్రామీణ, శికారిపుర, చిక్కోడి-సదలగ స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల్లో జేడీఎస్ పోటీ చేయడం లేదు. కేపీఎస్‌సీ గ్రూపు-1, గ్రూపు-2 నియామకాల రద్దుపై ఓ వైపు జేడీఎస్ నాయకుడైన మాజీ సీఎం కుమారస్వామి సీఎం సిద్ధరామయ్యపై రోజూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో కుతూహలం రేపుతోంది.

వాస్తవానికి ఈ మూడు నియోజక వర్గాల్లో జేడీఎస్‌కు చెప్పుకోదగ్గ బలం లేదు. పోటీ చేస్తే డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే. అందుకనే పోటీ చేయరాదని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానికంగా ఉండే జేడీఎస్ నాయకులను స్వయంగా కలసి మద్దతు కోరుతున్నారు. ‘మీ పార్టీ ఎటూ పోటీ చేయలేదు కనుక పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతునివ్వండి’ అని ఆయన సూచిస్తున్నారు. దీనిపై సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement