
జయమ్మ కోలుకుంటోంది.. ఆలయాల్లో బారులు
తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత జయలలిత కోలుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని ఆమె భక్తులు, అభిమానులు, కార్యకర్తలు, అనుచర వర్గం ఇప్పటికే ఆలయాల్లో బారుల తీరారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత జయలలిత కోలుకుంటున్నారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా గురువారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమెను సుబ్బయ్య విశ్వనాథన్ అనే చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. 'గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పర్యవేక్షణలో ఉంచాం. పూర్తిస్థాయిలో కోలుకోగానే డిశ్చార్జి చేస్తాం' అని విశ్వనాథన్ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
కాగా, జయలలితకు చికిత్స చేస్తున్న నేపథ్యంలో ఆ ఆస్పత్రి ప్రాంగణంలో దాదాపు 500 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఆస్పత్రి వైపుగా వెళ్లే అన్ని మార్గాలు మూసి వేసి ఆ ప్రాంతాల్లో ఉన్నవారికి ఇంటి నుంచే పనిచేసేలా ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా, జయలలిత త్వరగా కోలుకోవాలని ఆమె భక్తులు, అభిమానులు, కార్యకర్తలు, అనుచర వర్గం ఇప్పటికే ఆలయాల్లో బారుల తీరారు. పొర్లు దండాలు పెడతూ మొక్కు చెల్లించుకుంటున్నారు. చెన్నైలో పలువురు ముస్లిం కార్పొరేటర్లు మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేయిస్తున్నారు.