నగరం నిద్రపోతోంది

Insomnia less in Bangalore - Sakshi

బెంగళూరుకు నిద్రలేమి తక్కువే 

మెట్రో నగరాల సర్వేలో వెల్లడి

ఆఫీసులో బాగా పనిచేస్తే మంచి కునుకు

సాక్షి, బెంగళూరు : నిద్ర ఒక యోగం అని సెలవిచ్చారు పెద్దలు. ఎంత పరి వారం, సిరిసంపదలతో తులతూగుతున్నా కునుకు పట్టకపోతే నరకమే. పగలంతా పనిచేసి రాత్రి తనివితీరా నిద్రాదేవి ఒడిలో సేదదీరడం ఈ స్పీడ్‌ యుగంలో అదృష్టం కిందే లెక్క. ఎవరైతే ఆఫీసుల్లో 100 శాతం పనిచేస్తారో అలాంటివారికి చక్కగా నిద్రపడుతుందని, 75 శాతం అంతకన్నా తక్కువగా పనిచేసే వారు చాలా తక్కువగా నిద్రపోతారని ఇటీవల ఒక సర్వే పేర్కొంది. శుక్రవారం అంతర్జాతీయ నిద్ర దినోత్సవం సందర్భంగా ‘ఇండియా స్లీప్‌ అండ్‌ వెల్‌నెస్‌’ పేరిట సండే మాట్రెస్‌ సంస్థ ఈ సర్వేని నిర్వహించింది. దేశంలోని ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో సర్వే సాగింది. 25 ఏళ్లు పైబడిన ఉద్యోగుల నుంచి నిద్ర వివరాలను రాబట్టారు. ఈ సర్వే ప్రకారం పెద్ద వయసున్న ఉద్యోగుల కంటే 30 ఏళ్ల లోపు యువ ఉద్యోగులే సజావుగా నిద్రపోతున్నట్లు తేలింది. 45 ఏళ్ల పైబడిన ఉద్యోగులు నిద్రలేమితో బాధపడుతున్నారని తెలిసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది ఉదయం నిద్ర లేవాలంటే ఆలారమ్‌ తప్పక కావాల్సిందేనని చెప్పారు. 

బెంగళూరులో10 -11 గంటలకు పడకకు
బెంగళూరువాసులు రోజూ రాత్రి 10 నుంచి 11 గంటలల్లోపు పడక ఎక్కుతున్నారు. కానీ ముంబయి వాసులు అర్ధరాత్రి దాటితే కానీ నిద్ర పోవడం లేదని తెలిసింది. ముంబయి, ఢిల్లీతో పోల్చితే బెంగళూరు వాసులు అధికంగా, చక్కగా నిద్రపోగలుగుతున్నారు. – బెంగళూరులో తక్కువ శబ్ద కాలుష్యం బాగా నిద్రపోవడానికి ఒక కారణం. 

చిన్నపిల్లలతో కలిసి నిద్రించేవారికి మంచి నిద్ర పడుతోంది. పిల్లల్లేని భార్యభర్తలు నిద్రలేమితో ఇబ్బందులు పడుతున్నారు. 

నిద్రపోయే రెండు గంటల ముందు భోజనం చేస్తే బాగా నిద్రపడుతుంది. ఇలా రాత్రి భోజనం కూడా నిద్రపై ప్రభావం చూపుతుందని తెలిపింది. రాత్రిపూట తక్కువగా ఆహారం తీసుకునేవారిలో 50 శాతం మందికి పైగా మంచి నిద్రపోతున్నారని తెలిసింది. ఈ విషయంలో ఢిల్లీ, ముంబయి కంటే బెంగళూరు వాసులు కొద్దిగా ముందున్నారు. బెంగళూరు వాసులు రాత్రి పూట కొద్దిగా ఆహారం తీసుకుంటున్నారు. అందువల్ల చక్కగా నిద్రపోతున్నారు. 

కాగా, 52 శాతం పొగరాయుళ్లు రాత్రివేళల్లో  నిద్ర పట్టగా సతమతమవుతున్నారు. రోజుకి 5 నుంచి 10 సిగరెట్లు తాగేవారిలో 10 శాతం అధికంగా నిద్ర సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 

స్థూలకాయులను నిద్రాదేవి కనికరించడం లేదు. వారికి నిద్ర సమస్యలు తప్పడం లేదు. ఇక వారానికి 2–3 సార్లు జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసేవారు చాలా చక్కగా నిద్రపోతున్నారని తేలింది. 

ఉద్యోగం కోసం కొందరు ఆఫీసుకు వెళ్లేందుకు గంటకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటివారు కూడా సరిగా నిద్రపోవడం లేదు. ఎక్కువ ప్రయాణ సమయం నిద్రపై ప్రభావం చూపుతోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top