ఎక్కే విమానం, దిగే విమానం

Indians who spend a lot of money on foreign trips - Sakshi

విదేశీ ప్రయాణాలకు విపరీతంగా ఖర్చు చేస్తున్న భారతీయులు

ఐదేళ్లలో 253 రెట్లు పెరిగిన ఖర్చు

విదేశీ ప్రయాణం అంటే భారతీయులకు తెగ మోజులా ఉంది. ఎక్కే విమానం దిగే విమానంగా తెగ తిరిగేస్తున్నారు. గత ఐదేళ్లలోనే భారతీయులు విదేశీ ప్రయాణాలకు పెడుతున్న ఖర్చు భారీగా పెరిగింది. ఏకంగా 253 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇతర దేశాల్లో పర్యాటక ప్రాంతాలను చూడాలన్న ఆసక్తి.. అత్యున్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం.. గత కొంత కాలంగా బాగా పెరిగిపోయింది. దీంతో విదేశీయానాలు పెరిగిపోయాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 2014 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు విదేశీ ప్రయాణాల కోసం రూ.112 కోట్లు ఖర్చు పెడితే, 2018 సంవత్సరం వచ్చేసరికి ఆ ఖర్చు రూ.28 వేల కోట్లకు పెరిగిపోయింది. ఇది ఏకంగా 253 రెట్లు ఎక్కువ. విదేశాల్లో చదువుల కోసం 2014లో రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది వచ్చేసరికి ఆ ఖర్చు రూ.14 వేల కోట్లకు పెరిగింది. 2017లో భారత్‌ నుంచి పలు దేశాలకు 2.3 కోట్ల మంది ప్రయాణికులు వెళ్లారు. విదేశీ ప్రయాణాలకు భారతీయులు పెడుతున్న ఖర్చు భారత వాణిజ్య లోటుపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది.

ఎందుకిలా?
లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) అమల్లోకి వచ్చాక భారతీయులు విదేశాలకు వెళుతున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి పౌరుడు 2013–14లో వంద కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేయొచ్చన్న పరిమితులు ఉండేవి. దాన్ని ఇప్పుడు ఏకంగా 25,000 డాలర్లకు పెంచేశారు. విదేశాల్లో క్రెడిట్‌ కార్డు సౌకర్యాన్ని వాడుకునే సదుపాయం కూడా ఉంది. ఇవన్నీ కూడా విదేశీ ప్రయాణాలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. ‘2017 వరకు రూపాయి విలువలో పెద్దగా హెచ్చు తగ్గుల్లేవు. బ్యాంకుల్లో ఫైనాన్స్‌ కూడా సులభమైపోయింది. ప్రయాణాల కోసం ప్రత్యేకంగా లోన్‌ సౌకర్యం లేకపోయినా పర్సనల్‌ లోన్స్‌ పెట్టుకొని మరీ విదేశాలు చుట్టేసి వస్తున్నారు’ అని ముంబైకి చెందిన ఓ బ్యాంకు అధికారి తెలిపారు. విదేశాల్లో పెట్టుబడులు, ఆస్తులు సమకూర్చుకోవడం వంటివి మాత్రం తగ్గిపోతున్నాయి. ఎందుకంటే విదేశాల్లో భారతీయులు మనీ ఇన్వెస్ట్‌ చేయడం, విదేశాల్లో జరిగే లావాదేవీలపై ఆర్‌బీఐ ఒక కన్నేసి ఉంచుతోంది.  
 – సాక్షి, హైదరాబాద్‌ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top