వరి కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) రూ.60 పెంచాలని వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిషన్(సీఏసీపీ).. కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
న్యూఢిల్లీ: వరి కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) రూ.60 పెంచాలని వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిషన్(సీఏసీపీ).. కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. క్వింటాల్ ఎంఎస్‌పీని రూ.1,410 నుంచి 1,470కి పెంచాలని సూచించింది. గ్రేడ్ ఏ రకం ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ.1,450 ఉంది. ఎంఎస్‌పీలకు కేంద్రం రైతుల నుంచి ధాన్యాన్ని కొంటుంది. పత్తి, పప్పులు తదితర 14 పంటలకు మద్దతు ధరలను 2016-17కిగాను పెంచాలని సిఫారసు చేస్తూ వ్యవసాయ శాఖకు సీఏసీపీ నివేదికను సమర్పించింది.
క్వింటాల్ కంది పప్పు ఎంఎస్‌పీని రూ.200 పెంచి రూ.4,625గా నిర్ణయించాలంది. పెసర, మినప పప్పుల ఎంఎస్‌పీని రూ.150 పెంచి వరుసగా రూ. 4,800, రూ.4,575గా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాల అభిప్రాయాలను తెలుసుకుని కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముంది. పెంచిన కనీస ధరల కారణంగా ఈ ఏడాది గణనీయంగా పప్పు ధాన్యాలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి ప్రదర్శిస్తారని వ్యవసాయ శాఖ భావిస్తోంది.