ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు దాఖలుచే సే అసంపూర్తి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించవచ్చని, అందుకు ఆ అధికారికి సాధికారత ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానానికి ఎన్నికల సంఘం తెలియజేసింది.
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు దాఖలుచే సే అసంపూర్తి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించవచ్చని, అందుకు ఆ అధికారికి సాధికారత ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానానికి ఎన్నికల సంఘం తెలియజేసింది. ‘నామినేషన్ పత్రాల్లో అభ్యర్థులు అన్ని ఖాళీలనూ పూరించాలి. అవసరమైన చోట ‘నిల్’ లేదా ‘వర్తించదు’ అని పేర్కొనాలి. అలాకాకుండా ఖాళీలు వదిలేసినట్లైతే ఆ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించవచ్చు’ అని ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం, న్యాయమూర్తి రంజనాప్రకాశ్ దేశాయ్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనానికి సోమవారం ఈసీ తరఫు న్యాయవాది మీనాక్షీ అరోరా వివరించారు.
నామినేషన్ పత్రాల్లో ఖాళీలను పూరించకుండా వదిలేయడమంటే.. అభ్యర్థి వాస్తవాలను దాచిపెట్టడం కిందకే వస్తుంద న్నారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో కీలక సమాచారాన్ని ఇవ్వకపోవడం రివాజుగా మారిం దంటూ రిసర్జెన్స్ ఇండియా అనే ఎన్‌జీవో 2008లో దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈసీ ఈ మేరకు వివరణనిచ్చింది. అయితే ఎన్నికల్లో పోటీ చేయడమనేది రాజ్యాంగబద్ధమైన హక్కు అని, సమాచారాన్ని దాచిపెట్టినా నామినేషన్ పత్రాల్ని తిరస్కరించరాదంటూ గతంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పిందంటూ కేంద్రం తరఫు న్యాయవాది ఎ.మరియపుథమ్ వాదించారు. దీంతో ముగ్గురు న్యాయమూర్తుల సమక్షంలోనే వాదనలు వింటామంటూ విచారణను జస్టిస్ సదాశివం మంగళవారానికి వాయిదావేశారు. అయితే నామినేషన్ పత్రాల్లో అసలు ఖాళీలు ఎందుకు ఉంచాలి? దీనిపై అభిప్రాయం ఏంటో తెలపాలంటూ కేంద్రాన్ని ఆదేశించారు.