ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. ముఖ్యంగా దేశంలోని మధ్య, వాయవ్య ప్రాంతాల్లో అతి తక్కువ వర్షాలు పడతాయని, ఈశాన్య, దక్షిణాదిలో మాత్రం సాధారణ వర్షాలు పడొచ్చని తెలిపింది. వచ్చే వర్షాకాలంలో ఎన్‌నినో ఏర్పడే అవకాశం 70 శాతం ఉందని భారత వాతావరణ శాఖ దీర్ఘకాలిక అంచనాల విభాగం డెరైక్టర్ డీఎస్ పాయ్ వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో సముద్ర జలాలు వేడెక్కడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు.
దీనిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 93 శాతమే ఉంటుందన్నారు. దీర్ఘకాలిక సగటులో 90 నుంచి 96 శాతం వర్షం పడితే సాధారణం కంటే తక్కువగా పరిగణిస్తారు. 96 నుంచి 104 శాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా గుర్తిస్తారు. దీంతో ఈ ఏడాది కరువు పరిస్థితులు ఏర్పడటానికి 33 % అవకాశముందని మంత్రి వివరించారు. వాతావరణ ప్రభావాన్ని ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉంటామని వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు.