దక్షిణాదిన పెరుగుతున్న హిందీ ప్రభావం

Hindi Speakers Are Increasing In South India - Sakshi

 ఉత్తరాది నుంచి తమిళనాడు, కేరళకు పోటెత్తుతున్న వలసలు

పదేళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో 45శాతం పెరిగిన హిందీ వాళ్లు

భాష, సంస్కృతులపై ప్రభావం

ఉపాధి కోసం  ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస పోవడం మన దేశంలో సహజమే. అయితే,ఈ వలసల పుణ్యమా అని దక్షిణాదిన (భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో) మాట్లాడే భాషల శాతం మారిపోయే పరిస్థితి ఏర్పడింది.  ఉత్తర ప్రదేశ్‌ అంటే హిందీ మాట్లాడే వారు ఎక్కువ ఉన్న రాష్ట్రమని, ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగు, తమిళనాడు తమిళం మాట్లాడేవారు మెజారిటీగా ఉన్నారని, కేరళ మలయాళీలదని ప్రస్తుతం అందరూ భావిస్తున్నారు.అయితే, ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలసలు ఎక్కువవుతున్న నేపథ్యంలో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా హిందీ మాతృభాషగా చెప్పుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల అర్థం మారిపోతోంది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ  విడుదల చేసిన 2016–17 ఆర్థిక సర్వే ఈ విషయాన్ని నిర్థారించింది. దేశ ఆర్థిక  సమగ్రతకు సంస్కృతి, సంప్రదాయాలు అడ్డుకావని ఈ పరిణామం స్పష్టం చేస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ఆర్థిక సర్వే ప్రకారం 2001 –2011 మధ్య హిందీయేతర రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లలో హిందీ మాతృభాషగా చెప్పుకునే వారి సంఖ్య 45శాతం పెరిగింది. స్వాతంత్రానికి పూర్వం, తరువాత కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాలకు పేరుగాంచిన తమిళనాడులోనే హిందీ మాతృభాషగా చెప్పుకునే వారి శాతం మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ పెరగడం విశేషం.
2001–2011 మధ్య హిందీ రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బిహార్, రాజస్థాన్‌ల నుంచి 20–29 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువ మంది దక్షిణాది రాష్ట్రాలకు వలస వచ్చారని సర్వే వెల్లడించింది. ఈ కాలంలో ఉత్తర ప్రదేశ్‌ నుంచి 58.3 లక్షలు, బిహార్‌ నుంచి26.3 లక్షల మంది యువత దక్షిణాది రాష్ట్రాలకు వలస పోయారు. వీరిలో 10 లక్షల మంది ఒక్క తమిళనాడుకే వెళ్లారని ఆర్థిక సర్వే తెలిపింది.తమిళనాడు తర్వాత ఎక్కువ మంది వలసదారులు వెళ్లిన రాష్ట్రం కేరళ.

ఉపాధి కోసం పేద రాష్ట్రాల(ఉత్తర,ఈశాన్య రాష్ట్రాలు) నుంచి ధనిక రాష్ట్రాలకు(దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు) వలసలు అనివార్యమవుతున్నాయి. ఉపాధి కోసం జరుగుతున్న ఈ వలసలు ఆయా రాష్ట్రాల్లో సాంస్కృతిక, భాష మార్పులకు కారణమవుతున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2011 జనాభా లెక్కల్లోని భాషకు సంబంధించిన గణాంకాల ప్రకారం 2001–2011 మధ్య హిందీ రాష్ట్రాల( ఉత్తర ప్రదేశ్, బిహార్, జార్ఖండ్,ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ) జనాభా 21శాతం పెరిగింది. అదే సమయంలో తమిళనాడు, కేరళ,  కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో హిందీ మాతృభాషగా చెప్పుకునే వారి సంఖ్య45శాతం పెరిగింది.  ఈ రాష్ట్రాల్లో స్థానిక భాష మాట్లాడే వారి సంఖ్యతో పోలిస్తే ఇది నామమాత్రమే అయినా పెరుగుదల శాతం మాత్రం గుర్తించదగినది.

ప్రస్తుతం స్థానికేతర గొడవలు జరుగుతున్న గుజరాత్‌ విషయానికి వస్తే 2001–2011 మధ్య గుజరాత్‌లోని మొత్తం 26 జిల్లాలకు గాను 21 జిల్లాల్లో హిందీ మాతృభాషగా చెప్పుకునే వారు 23శాతం పెరిగారు. మొత్తం మీద చూస్తే ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలసలు ఏటా పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. అయితే, ఈ వలసలు ఆయా రాష్ట్రాల్లో సాంస్కృతికంగా, సామాజికంగా ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడే చెప్పలేం. గుజరాత్‌ తాజా అల్లర్లు దీని ఫలితమేనా..ఈ పరిణామం ఒక్క గుజరాత్‌కే పరిమితమా లేక ఇతర దక్షిణ రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top