కిలో ధర రూ. 20 లక్షలు.. కానీ ఇప్పుడు..

Himalayan Viagra Costlier Fungus Now In IUCN Red List Vulnerable Category - Sakshi

డెహ్రాడూన్‌: లైంగిక ఉద్దీపన కోసం వాడే, హిమాలయన్‌ వయాగ్రాగా గుర్తింపు పొందిన ‘యార్సాగుంబా’ను ఐయూసీఎన్‌(ఇంటర్నేషనల్‌ యూనియన​ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌​ నేచర్‌) అంతరించి పోయే జాతుల జాబితాలో చేర్చింది. అత్యంత ఖరీదైన ఈ వన మూలిక త్వరలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు జూలై 9న విడుదల చేసిన నివేదికలో అంతరించే పోయే జీవ జాతుల(జంతువులు, మొక్కలు) జాబితాను పొందుపరిచింది. ఇందుకు సంబంధించిన తొమ్మిది కేటగిరీల్లో యార్సాగుంగాను ‘వల్నరబుల్‌’ కేటగిరీలో చేర్చింది. అధికంగా సేకరిస్తున్న కారణంగా గత 15 ఏళ్లుగా దీని విస్తరణ 30 శాతానికి పడిపోయిందని పేర్కొంది.

ఈ విషయం గురించి ఐయూసీఎన్‌ భారత ప్రతినిధి వివేక్‌ సక్సేనా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. హిమాలయన్‌ వయాగ్రా కనుమరుగైపోకుండా ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకునేందుకు ముందుకు రావాలనే ఉద్దేశంతో తాము ఈ వనమూలికను రెడ్‌ లిస్టులో చేర్చినట్లు తెలిపారు. కాగా ఐయూసీఎన్‌ తాజా నివేదిక ఉత్తరాఖండ్‌లోని అనేక మంది గ్రామీణ ప్రజలు ఉపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

కిలో రూ. 20 లక్షలు
గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్‌ను యార్సాగుంబా అని పిలుస్తారు. శీతాకాలంలో ఇది పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్‌ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడువు ఉంటుంది. టిబెట్‌ పీఠభూమి, నేపాల్‌, చైనా, భారత్‌, భూటాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. ఉత్తరాఖండ్‌లో దీనిని కీడా జాడీగా వ్యవహరిస్తారు. పితోరాఘర్‌, చమోలీ జిల్లాలో అత్యధిక మంది ప్రజలు జీవనోపాధి కోసం యార్సాగుంబా సేకరణపై ఆధారపడుతున్నారు. 

అంతర్జాతీయ మార్కెట్లలో కిలో యార్సాగుంబా ధర దాదాపు రూ. 20 లక్షలు పలుకుతుంది. అందుకే బంగారం కన్నా విలువైన ఈ మూలిక కోసం చిన్నాపెద్దా అంతా వేట సాగిస్తారు. ప్రాణాలు పణంగా పెట్టి మరీ యార్సాగుంబా సేకరణలో తలమునకలైపోతారు. ఏప్రిల్‌ నుంచి జూన్​ రెండో వారం వరకు యార్సాగుంబాను సేకరిస్తారు. అయితే ప్రస్తుతం కేడా జాడీని కనుమరుగయ్యే జాబితాలో పెట్టినందున హార్వెస్టింగ్‌ పీరియడ్‌ను నెల రోజులకు కుదించినట్లు అల్‌మోరాలోని జీబీ పంత్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ ఎన్విరాన్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ రావల్‌ తెలిపారు. 

ఈ ఏడాది అస్సలు బాలేదు
ఈ విషయం గురించి పితోఘర్‌ జిల్లాలోని గోల్ఫా వాన్‌ పంచాయతీ ప్రధాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది పరిస్థితులు అస్సలు బాగాలేవు. కీడా జాడీని సేకరించేందుకు అనుమతి లభించలేదు. క్యాంపులు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడేమో ఈ రెడ్‌ లిస్టు. దీని వల్ల మా ఆ ఆదాయం దెబ్బతింటుంది. అనేక కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంటాయి’’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గతేడాది జిల్లా యంత్రాంగాలు ప్రజలకు పాసులు ఇచ్చి.. అటవీ అధికారుల పర్యవేక్షణలో కీడా జాడీని సేకరించే వీలు కల్పించింది. అయితే ఈ ఏడాది కోవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో వారు ఆర్థికంగా నష్టపోయారు. 

ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్‌తో వల్ల హార్వెస్టింగ్‌కు ఇబ్బంది తలెత్తడం, ఈ ఏడాది తగినంతగా ఫంగస్‌ ఉత్పత్తి కాకపోవడంతో రానున్న రోజుల్లో డిమాండ్‌ పెరిగే అవకాశం ఉన్నందున గ్రోత్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక అటవీ అధికారులు తెలిపారు. కాగా బురదలో పెరిగే ఈ పసుపు రంగు మూలికకు లైంగిక కోరికలు పెంచడం, నపుంసకత్వాన్ని నయం చేయడమే గాక.. కీళ్ల నొప్పులు, ఊబకాయం తగ్గించడంతో పాటుగా కేన్సర్‌ కణాలను నాశనం చేయగల గుణాలున్న ఔషధం అని చైనా పరిశోధకులు గతంలో పేర్కొన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top