దత్తన్నకు జన్మదిన శుభాకాంక్షలు

Himachal Pradesh Raj Bhavan Birthday Wishes To Governor Bandaru Dattatreya - Sakshi

సిమ్లా : హైదరాబాద్‌ నగరంలోని అతి సామన్య పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి.. నేడు ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా సేవలు అందించే స్థాయికి ఎదిగారు. ఆయనే హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రస్తుత గవర్నర్‌ బండారు దత్తాత్రేయ. నేడు దత్తాత్రేయ 74వ జన్మదినం సందర్భంగా ఆ రాష్ట్ర రాజ్‌భవన్‌ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

1946 జూన్ 12 న హైదరాబాద్‌ గౌలిగూడలోని అతి సామాన్య పేద కుటుంబంలో జన్మించిన దత్తాత్రేయ.. చిన్నతనంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొని బతుకు ప్రయాణం సాగించారు. ఉల్లిగడ్డలు అమ్ముకొనే తన తల్లికి సాయం చేస్తూనే  రాత్రిపూట విద్యనభ్యసించారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో ఏర్పడ్డ బంధం ఆయనను దేశభక్తి వైపు తీసుకెళ్లడమే కాకుండా క్రమశిక్షణతో జీవించేలా చేసింది. పేదప్రజల సమస్యల పట్ల అయన అంతులేని పోరాటాలకు, దివిసీమ ఉప్పెన లాంటి విపత్కర పరిస్థితులలో చేసిన సహాయానికి ఆర్ఎస్ఎస్ నేర్పించిన పాఠాలే ప్రేరణ అయ్యాయి.

రాజకీయాలకు సంబంధించి.. మొదటి సారి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అయినా నిరంతరం ప్రజల్లో ఉంటూ..  తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఎంపీగా గెలుపొందారు. నాటి దివంగత వాజ్‌పేయి, ఇప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. మరోవైపు అలయ్- బలయ్ పేరుతో అయన నిర్వహించే కార్యక్రమం తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతోంది. 


ఎమర్జెన్సీ కాలంలో దత్తాత్రేయ మారువేషంలో తెలంగాణ లోని బెల్లంపల్లి వద్ద పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నప్పటి చిత్రాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top