హిమాచల్‌లో పోటెత్తిన వరద : 18 మంది మృతి

Heavy Rainfall Lashes Himachal Pradesh - Sakshi

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోతతో రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. పోటెత్తిన వరదతో రాష్ట్రవ్యాప్తంగా 18 మంది మరణించారు. వరద తీవ్రతతో సిమ్లా, కులు జిల్లాల్లో అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సిమ్లాలో ఎనిమిది మంది, కులూ, శ్రీమర్‌, సొలన్‌, చంబా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారని అధికారులు వెల్లడించారు.

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల వరద నీరు ఇళ్లు, రహదారులను ముంచెత్తింది. వరద ఉధృతి కారణంగా కులు పట్టణం సమీపంలోని వంతెన కొట్టుకుపోయింది. సట్లెజ్‌ నది పోటెత్తడంతో ముందుజాగ్రత్తగా సట్లజ్‌ జల విద్యుత్‌ నిగమ్‌కు చెందిన దేశంలోని అతిపెద్ద హైడ్రో ప్రాజెక్టు నుంచి మిగులు జలాలను విడుదల చేశారు. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top