తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల భీభత్సం

Heavy Rain in Srikakulam District - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం 12 మంది పిడుగు బారిన పడి మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు పిడుగులు పడటంతో ఏడుగురు మృతి చెందారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో పిడుగులు పడి ఇద్దరు మృతిచెందగా.. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురంలో మరో ఇద్దరు పిడుగుల బారిన పడి మరణించారు. పట్టణం బలగలో పిడుగుపాటుకు పొట్నూరు యోగీశ్వర రావు, రణస్థలం మండలం పాపారావు పేటలో13 ఏళ్ల బాలిక పిడుగు పడి మృతి చెందారు.  జిల్లాలో భారీగా వర్షం పడుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇటు తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ నగరంలో భారీగా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. ఉరుములతో వర్షం పడుతోంది.

వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతోపాటు పిడుగుపాటుకు జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. బీ కోడూరు మండలం మేకవారి పల్లెలో పిడుగు పాటుకు సిద్దు వెంకటరమణా రెడ్డి అనే పోస్టుమెన్‌ మృతిచెందగా.. కాజీపేట మండలం బీచువారి పల్లె గ్రామంలో పిడుగు పాటుకు ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కడప ఆసుపత్రికి తరలించారు. వీరిలో దస్తగిరమ్మ మృతి చెందగా.. బీబీ చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా విజయనగరం ఎస్‌ కోట మండలం కాపు సోంపురానికి చెందిన చింతాడ రమణ అనే రైతు పిడుగు పడి మృతి చెందాడు. 
 
వికాబారాద్ జిల్లా ధారుర్ మండలంలోని అవుసూపల్లి సమీపంలో ఉన్న రాంమందిరం వద్ద  ఇద్దరు  అనుమనాస్పద మృతి చెందారు. వారు పిడుగు పడి మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చెశారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top