
శివకుమార్, చిదంబరం
న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సమయంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)ని మందలించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన శివకుమార్ బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తుపై జస్టిస్ సురేశ్ కైత్ గురువారం విచారణ చేపట్టారు. ఈడీ తరఫున వాదనలు వినిపించాల్సిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ఆ సమయంలో కోర్టు హాలులో లేరు.
రౌజ్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్టులో పని ఉండటంతో ఆయన రాలేకపోయారని, అరగంట సమయం ఇవ్వాల్సిందిగా ఈడీ తరఫు లాయర్లు కోరడంతో జస్టిస్ సురేశ్ కైత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోర్టుతో దాగుడుమూతలు ఆడకండి. ఇది ఎంత మాత్రం సరికాదు. కోర్టు వేచి ఉండాల్సిన అవసరం లేదు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ వాదనలను 19వ తేదీ మధ్యాహ్నానికల్లా రాత పూర్వకంగా ఇవ్వాలంటూ ఈడీ లాయర్లను ఆదేశించారు. అయితే, కొద్దిసేపటి తర్వాత కోర్టుకు చేరుకున్న నటరాజ్ క్షమాపణ కోరడంతో న్యాయమూర్తి విచారణకు అంగీకరించారు. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఏఎస్‌జీ వాదించారు. వాదనల అనంతరం శివకుమార్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
చిదంబరం కస్టడీ పొడిగింపు
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో పి.చిదంబరం జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. ఈడీ అర్జీపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం జడ్జి అజయ్ కుహర్ మరో 14 రోజుల పాటు కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. 24 వరకు విచారించేందుకు ఈడీకి అనుమతినిచ్చారు. అదేవిధంగా, చిదంబరం విజ్ఞప్తి మేరకు వెస్టర్న్ టాయిలెట్, మందులు, ఇంటి భోజనం సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.