సైనికుల చిత్రాలతో చీర నేసిన సూరత్‌ వ్యాపారి

Gujarat Mill Creates Sarees With Images of Soldiers To Pay Tribute To Pulwama Attack - Sakshi

గాంధీనగర్‌ : గత వారం జరిగిన పుల్వామా ఉగ్ర దాడి నుంచి భారతావని ఇంకా కోలుకోలేదు. దేశమంతా ఓ వైపు తమ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళుర్పిస్తూనే.. మరో పక్క దాయాది దేశం పట్ల తీసుకోబోయే ప్రతీకార చర్యల గురించి చర్చించుకుంటుంది. ఈ నేపథ్యంలో అమర జవాన్లకు నివాళులర్పించేందుకు వినూత్న మార్గాన్ని ఎన్నుకున్నారు గుజరాత్‌ వస్త్ర వ్యాపారులు. భారతీయ సంప్రదాయానికి చిహ్నమైన చీర మీద.. సరిహద్దుల్లో పహరా కాస్తూ మాతృభూమి కోసం ప్రాణాలర్పించే సైనికుల ఫోటోలను చిత్రించారు. ప్రస్తుతం ఈ చీరకు విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకోవడమే కాక మాకు కూడా​ కావాలంటూ క్యూ కడుతున్న వారి సంఖ్య భారీగా ఉందంటున్నారు చీరను తయారు చేసిన వ్యాపారి.

సూరత్‌కు చెందిన అన్నపూర్ణ బట్టల మిల్లు ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ఈ విషయం గురించి మిల్లు యజమాని మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. వీరి త్యాగం వెలకట్టలేనిది. తమ కుటుంబాల గురించి ఆలోచించకుండా దేశం కోసం మనం కోసం ప్రాణాలర్పించారు. వారి త్యాగాలకు చిహ్నంగా జవాన్ల ఫోటోలతో ఈ చీరలను రూపొందించాము. వీటిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు అందిస్తాము. ఈ చీరల మీద మన సైన్యం శక్తిని, యుద్ధ ట్యాంకులను, తేజోస్‌ విమానాల బొమ్మలను ముద్రించామ’ని తెలిపారు. ప్రస్తుతం ఈ చీరలకు ఫుల్‌ డిమాండ్‌ ఉందని.. దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు మిల్లు యజమాని.

ఇదిలా ఉండగా పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ కమాండర్‌ ఆదిల్‌... సీఆర్‌పీఎఫ్‌ బలగాల వాహన శ్రేణిని ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలో పుల్వామా దాడిలో కీలక సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top