బానోకు 50 లక్షలు కట్టండి

 Gujarat Govt to Give Bilkis Bano Rs 50 Lakh as Compensation a Job - Sakshi

బిల్కిస్‌ బానో కేసులో గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ: 2002లో గుజరాత్‌లో గోద్రా అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానోకు రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని సుప్రీంకోర్టు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  కేసు విషయంలో నిర్లక్ష్యం చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గుజరాత్‌ సర్కార్‌ను ఆదేశించింది. ఆ అధికారులకు పెన్షన్‌ ప్రయోజనాలు నిలిపివేయాలని.. బాంబే హైకోర్టు దోషిగా తేల్చిన ఐపీఎస్‌ అధికారికి రెండు ర్యాంకులు తగ్గించాలని (డిమోట్‌) ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడినధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. బానోకు పరిహారంగా రూ.5 లక్షలు ఇవ్వాలన్న గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె తిరస్కరించింది. తనకు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

బానో తరఫున అడ్వొకేట్‌ శోభా గుప్తా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు దోషులుగా ప్రకటించిన అధికారులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. వీరిలో ఒక ఐపీఎస్‌ అధికారి వచ్చే ఏడాది రిటైర్‌ కాబోతున్నారని, మిగతా నలుగురు ఇప్పటికే రిటైర్‌ అయ్యారని పేర్కొన్నారు. వీరిపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు నివేదించారు. ఈ దారుణ ఘటన తర్వాత బానో దుర్భర జీవితం గడిపిందని.. భయపడుతూ వివిధ ప్రాంతాల్లో తలదాచుకుందని పేర్కొన్నారు. ఆమెకు ఆమోదయోగ్యమైన పరిహారం చెల్లించాలని కోర్టును కోరారు. ఇక గుజరాత్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. 

ఆనాడు ఏం జరిగింది? 
గోద్రా అల్లర్ల సమయంలో 2002 మార్చి 3న అహ్మదాబాద్‌ దగ్గర్లోని రాధికాపూర్‌లో బానోపై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. ఆమె కుటుంబసభ్యులు 14 మందిని అత్యంత పాశవికంగా హతమార్చారు. మృతుల్లో ఆమె తల్లి, రెండేళ్ల కూతురు ఉన్నారు. ఘటన జరిగినపుడు బానో 5నెలల గర్భిణి. అప్పటినుంచి న్యాయం కోసం పోరాడుతోంది.  పోలీసులు, ఎన్జీవో సహా పలు కోర్టులను ఆశ్రయించింది. న్యాయం జరగకపోయే సరికి చివరకు సుప్రీంకోర్టులో కేసువేసింది. కేసును కోర్టు సీబీఐకి అప్పజెప్పింది. 2004లో ఈ కేసుకు సంబంధించి తగిన ఆధారాలు సేకరించిన అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సీబీఐ అరెస్టు చేసింది.

చివరికి 2008లో బిల్కిస్‌ బానో కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు పోలీసు అధికారులు, ఓ ప్రభుత్వ డాక్టరు సహా 19 మందిపై అభియోగాలు నమోదు చేసింది. వీరిలో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2008 జనవరి 11న తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ నిందితులు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను 2017లో ముంబై హైకోర్టు బలపరిచింది. వీరిలో ముగ్గురిని ఉరి తీయాలని సీబీఐ వాదించింది. కోర్టు సీబీఐ వాదనను తోసిపుచ్చింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top