ఔత్సాహిక నేతల కోసం ట్రైనింగ్‌ సెంటర్‌

UP govt to set up Rs 2-bn political training institute in Ghaziabad - Sakshi

లక్నో: డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులుగా మారేందుకు ప్రత్యేకంగా కళాశాలలు ఉన్నాయి. అదే తరహాలో రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునేందుకు ఓ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకీయ శిక్షణా కేంద్రం కోసం రూ.198 కోట్ల నిధులను యూపీ ప్రభుత్వం కేటాయించింది. దాదాపు 16 ఎకరాల్లో ఇక్కడి ఘజియాబాద్‌ జిల్లా కేంద్రంలో దీని నిర్మాణం జరగనుంది.

ఈ శిక్షణా కేంద్రంలో రాజకీయాల్లోకి రావాలనుకునే వ్యక్తులతో పాటు చట్టసభల ప్రతినిధులు చేరవచ్చని యూపీ పట్టణాభివృద్ధి మంత్రి సురేశ్‌ కుమార్‌ ఖన్నా తెలిపారు. ఇక్కడి విద్యార్థులకు వేర్వేరు దేశాధినేతలు, నిపుణులు, రాయబారులు, రాజకీయ ప్రముఖులతో తరగతులు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీ పర్యటనకు వచ్చే ప్రజలు సందర్శించేందుకు వీలుగా దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో ఉన్న ఘజియాబాద్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ శిక్షణా కేంద్రాన్ని యూపీ పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహిస్తుందనీ, దీనికి గుర్తింపు కోసం పలు జాతీయ విశ్వవిద్యాలయాలతో చర్చిస్తున్నామని సురేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పాఠ్యాంశాల రూపకల్పనకు ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామనీ, మరో రెండేళ్లలో ఈ శిక్షణా కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top