‘పారిశ్రామిక మహిళ’కు చేయూత

Global Entrepreneurship Summit 2017 - Sakshi

హైదరాబాద్‌లో జీఈఎస్‌కు ముందు అమెరికాలో సదస్సు

ఉద్యోగ అవకాశాల కోసం చూడటం కాదు.. ఉపాధి కల్పించే శక్తిగా ఎదగాలనే ప్రయత్నం చేస్తోంది యువత. ఈ ప్రయత్నంలో మహిళలకూ చేయూతనిచ్చేందుకు, ఆర్థికవృద్ధిలో వారినీ భాగస్వాములను చేసి ప్రోత్సహించేందుకు ‘జీఈఎస్‌’ (గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సమిట్‌–ప్రపంచ వాణిజ్య సదస్సు)ను నిర్వహిస్తున్నాయి పారిశ్రామికంగా బలపడాలనుకుంటున్న దేశాలు. అమెరికా, యూరప్‌ దేశాలతోపాటు భారత్‌ కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. హైదరాబాద్‌ వేదికగా ఈనెల 28న ఈ సదస్సు భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకా కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సాధిస్తున్న విజయాల గురించి మన దేశంలోని ఔత్సాహికులకు అవగాహన కల్పించేందుకు భారత్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ ఓ మినీ సదస్సును ఆ దేశంలో నిర్వహిస్తోంది. భారత్‌ నుంచి విలేకరులను అమెరికా తీసుకెళ్లి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా వివరిస్తోంది.

ఆన్‌లైన్‌ వేధింపులకు చెక్‌ పెట్టేలా...
సాంకేతికతలో ఎంత వేగంగా పురోగతి సాధిస్తున్నామో అంతే వేగంగా సమస్యలు పుట్టుకొస్తు న్నాయి. ఈ మధ్య మరీ ఎక్కువైన సమస్య సామాజిక మాధ్యమాల దుర్వినియోగం. ఈ చిక్కు నుంచి బయట పడేసే వెబ్‌ అప్లికేషన్లు ఇప్పుడు స్టార్టప్స్‌ దశలో ఉన్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శరణార్థులకు ఎక్కడ సరైన సంరక్షణ, పని, తిండి, దొరుకుతుందనే వివరాలను చెప్పి... వాళ్లు అక్కడికి వెళ్లే మార్గాలను సూచించే యాప్‌లూ వస్తున్నాయి. ఈ రకమైన స్టార్టప్స్‌కూ విపరీతమైన డిమాండ్‌ ఉందని వాషింగ్టన్‌ డీసీలో అఫినిస్‌ ల్యాబ్స్‌ అనే ఇంక్యుబేటర్‌ను నిర్వహిస్తున్న భారతీయ–అమెరికన్, చెన్నైకి చెందిన షాహిద్‌ అమానుల్లా నిరూపిస్తున్నారు. ఈయన మహిళలు కంపెనీలు ప్రారంభించడానికి అవసరమైన నిధులను సమీకరించడమో లేదా అలాంటి వేదికలను వారికి పరిచయం చేయడమో చేస్తారు.

అమెరికా వచ్చే వారికి ఫెమిగ్రెంట్స్‌ ప్రోత్సాహం...
ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్‌ కంటెంట్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న ఐకా అలియేవా, ఫేస్‌బుక్‌లో లాజిస్టిక్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ వింగ్‌లో ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లావణ్య పోరెడ్డి (హైదరాబాద్‌) కలిసి ‘ఫెమిగ్రెంట్స్‌’ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. అమెరికాకు వలస వస్తున్న మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ఈ నెట్‌వర్క్‌ తోడ్పడుతుంది. విమెన్‌ ఎంట్రప్రెన్యూర్స్‌గా విజయం సాధించి, స్థిరపడిన వాళ్లను కొత్త వారికి ఫెమిగ్రెంట్స్‌ పరిచయం చేస్తుంది. ప్రారంభంలో ఎలాం టి సమస్యలుంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఆర్థిక సహాయం వంటి వాటి గురించి అవగాహన కల్పిస్తారు. మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే తమ లక్ష్యమని చెప్తారు అలియేవా, లావణ్య. 

— వాషింగ్టన్‌ డీసీ నుంచి సరస్వతి రమ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top