మహిళలపై కాదు, మగాళ్లపై దృష్టి పెట్టాలి!

Focus on Men not Women - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లో ఇటీవల ముక్కుపచ్చలారని ఏడేళ్ల పసిపాపపై సామూహిక అత్యాచారం జరిపి అనంతరం అగ్నికి ఆహుతి చేసిన మృగాల పైశాచిక చర్య లేదా భారత్‌లోని కురుక్షేత్రలో 15 ఏళ్ల దళిత బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ గురించి వార్తలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా......‘చీకటవుతోంది..... సురక్షితం కాదు..... అక్కడికి ఒంటరిగా వెళ్లకు.... .అలాంటి దుస్తులు ధరించినట్లయితే సమస్యలు కోరి తెచ్చుకోవడమే.. ..ఇంత రాత్రి వేళ నీవు బయటకు వెళ్లడం మంచిది కాదు...’ అంటూ అమ్మాయిలను సమాజం హెచ్చరించడం వింటుంటాం. తరాలు మారినా ఈ మాటలు మారలేదు. ఇలాంటి దారుణ కీచక చర్యలకూ తెరపడలేదు. ఎందుకు?

ఇప్పటివరకూ మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడల్లా సమాజం మహిళలపై దృష్టిని కేంద్రీకరించి ఇలాంటి మాటలతో హెచ్చరిస్తోంది. నీతి సూక్తులు చెబుతోంది. అందుకే పరిస్థితిలో మార్పులేదు. అయితే ఇక్కడ దృష్టిని కేంద్రీకరించాల్సింది దారుణాలకు పాల్పడుతున్న మగవాళ్లపై. నీతి బోధలు చేయాల్సింది, హెచ్చరికలు చేయాల్సింది వారికే. మగవాళ్లు చిన్న పిల్లల నుంచి ఎదుగుతున్నప్పుడే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరి నుంచి గురువుల వరకు వారికి సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పాలి.

మహిళలను గౌరవపరిచే సంస్కతిని నేర్పించాలి. ఇలాంటి అభిప్రాయాలను పాకిస్థాన్‌ నుంచి వెలువడుతున్న ప్రత్యామ్నాయ సాంస్కృతిక పత్రిక ‘మోస్కీ’, సామాజిక కార్యకర్త అల్వీనా జాడూన్, బాలీవుడ్‌ హిందీ సినిమా ‘హిందీ మీడియం’లో నటించిన పాకిస్థాన్‌ సినీ తార సారా ఖబర్‌లు వ్యక్తం చేశారు. వాళ్లు వ్యక్తం చేసిన అభిప్రాయల వీడియోలో సోషల్‌ మీడియాలో అందుబాటులో ఉన్నాయి.

‘సమాజంలో జరుగుతున్న దారుణాలను ఎదుర్కోవడం సమష్టి బాధ్యత. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే అందుకు కారకులు ఎవరు? మగవాళ్లు. ఆడవాళ్లకు కాదు, ప్రవర్తనా నియమావళి మగవాళ్లకు ఉండాలి. ఆడవాళ్ల మీది నుంచి దృష్టిని మగవాళ్లవైపు మళ్లించనప్పుడే మార్పు వస్తుంది. ‘మా ఆడవారు మంచివారు. గౌరవనీయులు. పవిత్రులు’ అని ఈ సమాజంలో చాలా మంది చెబతూ ఉంటారు. అవును, మీ ఆడవారు మంచి వారు, పూజ్యులే. మరి మీ మగపిల్లల సంగతేమిటీ? వారు మంచివారు కాదా? వారికి మంచీ, మర్యాదలు నీర్పలేదా? ముఖ్యంగా మహిళల పట్ల ఎలా నడుచుకోవాలో ప్రవర్తనా నియమావళిని ఎందుకు నిర్దేశించలేదు?’ అంటూ మోస్కీ వీడియో కొత్త వాదనను ముందుకు తీసుకొచ్చింది.

పాక్‌ సామాజిక కార్యకర్త అల్వీనా జండూన్‌ అదే తరహాలో మాట్లాడారు. ‘ఇలాంటి దారుణాలను ఎవరు అరికడతారు? ఏటేటా చెప్పిన మాటలనే చెబుతూ, చేసిన వాగ్దానాలనే చేస్తూ ఓట్లు అడుక్కునే రాజకీయ నాయకులు మారుస్తారా? మహిళల మీది నుంచి దృష్టిని మగవాళ్లపైకి మళ్లించి సమస్యను పరిశీలించినప్పుడే పరిష్కారం దొరకుతుంది’ అని ఆమె అభిప్రాయపడ్డారు. జైనాబ్‌ ఘటనపై టీవీలో పాకిస్థాన్‌ తార సారా ఖబర్‌ కన్నీళ్లపర్యంతమవుతూనే కఠినంగా మాట్లాడారు.

‘ఈ ఘోర కృత్యాలను ఆపాల్సిందిగా నేను ఎవరికి విజ్ఞప్తి చేయాలో కూడా అర్థం కావడం లేదు. ప్రజలారా! ఎవరో వస్తారని, సాయం చేస్తారని ఎదురు చూడకండీ. మీరే కార్యరంగంలోకి దూకండి. మీ రక్షణ కోసం మీరే పోరాడండీ. మీ పిల్లలకు నేర్పండి, వారిని వారు ఎలా రక్షించుకోవాలో’ అని ఖబర్‌ పిలుపునిచ్చారు. జైనాబ్‌కు న్యాయం జరగాలంటూ వేలాది మంది పాకిస్థాన్‌ ప్రజలు ప్రతి రోజూ వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top