విడతలుగా విమాన సర్వీసులు?

Flight booking open from April 15 after coronavirus lockdown - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత దశలవారీగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత 21 రోజుల కరోనా లాక్‌డౌన్‌ ముగియనుంది. ఆ తర్వాత దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను దశలవారీగా ప్రారంభించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘దేశంలో వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ 14వ తేదీ తర్వాత దశల వారీగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నాం.

ఏప్రిల్‌ 14 తర్వాత ప్రయాణాలకు విమానయాన సంస్థలు టికెట్లు చేసుకోవచ్చు’అని ఓ అధికారి తెలిపారు. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తే మాత్రం ఆ మేరకు టికెట్లు క్యాన్సిల్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఎయిరిండియా మినహా ఇప్పటికే ప్రముఖ విమానయాన సంస్థలు 14వ తేదీ నుంచి జరిగే దేశీయ ప్రయాణాలకు టికెట్ల బుకింగ్స్‌ మొదలుపెట్టగా ఎయిరిండియా మాత్రం ఈ నెల 30 తర్వాత ప్రయాణాలకు మాత్రమే బుకింగ్స్‌ ప్రారంభించింది.

దెబ్బతిన్న విమానయాన రంగం
లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం పడిపోవడంతో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఎయిర్‌ డెక్కన్‌ సంస్థ అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి ఉద్యోగులంతా ఇళ్లలోనే ఉండాలని కోరింది.  

14 తర్వాత రైళ్లు !
దేశంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ప్రయాణికులు కనీస ముందు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటూ విడతల వారీగా సర్వీసులను ప్రారంభించాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ప్రయాణికులు వ్యక్తిగత దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ఆరోగ్య సేత్‌ యాప్‌ వాడుతూ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వారిని అనుమతించాలని భావిస్తోంది. తద్వారా కోవిడ్‌ వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఆశిస్తోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top