‘మంత్రిమండలి సమావేశంలోనే నిర్ణయించండి’ | Sakshi
Sakshi News home page

‘మంత్రిమండలి సమావేశంలోనే నిర్ణయించండి’

Published Wed, Nov 19 2014 10:27 PM

‘మంత్రిమండలి సమావేశంలోనే నిర్ణయించండి’ - Sakshi

సాక్షి, ముంబై: రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం మంత్రివర్గంలో తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఠాణాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలంటూ రాష్ర్ట ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించిన సంగతి విదితమే. అయితే ఆ దిశగా ఇప్పటివరకూ ఓ అడుగు కూడా పడలేదు.

ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పారంభించాలని, ఇదే ఆఖరు అవకాశమని ధర్మాసనం పేర్కొంది. ఆయా పోలీస్ స్టేషన్లలో లాకప్ మరణాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వడాల రైల్వే పోలీస్ స్టేషన్‌లో పోలీసులు తీవ్రంగా కొట్టడంవల్ల ఓ బాలుడు చనిపోయాడు. దీంతో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు అంశం మరోసారి తెర పైకి వచ్చింది. బాలుడి తండ్రి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఇందుకు  కారకులైన పోలీసులపై చర్యలు మొదలయ్యాయి.

తమ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని బాధిత తండ్రి కోర్టును వేడుకున్నాడు. ఇలా అనేక  లాకప్ మరణాల కేసులు పెండింగులో ఉన్నాయి. వారికి న్యాయం జరగడం లేదు. సరైన ఆధారాలు లేకపోవడంవల్ల దోషులైన పోలీసులకు శిక్ష పడడం లేదు. దీంతో అన్ని పోలీసు స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు అదేశించింది. గతంలోనే ఈ ఆదేశాలు జారీచేసినప్పటికీ ఇంతవరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

Advertisement
Advertisement