ఇక కారుణ్య మరణాలకు ఓకే | euthanasia likely to be possible soon in india | Sakshi
Sakshi News home page

ఇక కారుణ్య మరణాలకు ఓకే

May 10 2016 4:19 PM | Updated on Apr 3 2019 8:52 PM

హృతిక్, ఐశ్వర్య నటించిన 'గుజారిష్' చిత్రంలోనిదీ దృశ్యం. చనిపోయే హక్కు కల్పించాలంటూ హృతిక్ తరఫున ఐశ్యర్య కోర్టులో పోరాడటమే సినిమా ఇతివృత్తం - Sakshi

హృతిక్, ఐశ్వర్య నటించిన 'గుజారిష్' చిత్రంలోనిదీ దృశ్యం. చనిపోయే హక్కు కల్పించాలంటూ హృతిక్ తరఫున ఐశ్యర్య కోర్టులో పోరాడటమే సినిమా ఇతివృత్తం

దేశంలో కారుణ్య మరణాలను అనుమతించాలా, వద్దా అన్న అంశంపై కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న చర్చకు త్వరలోనే తెరపడనుంది.

దేశంలో కారుణ్య మరణాలను అనుమతించాలా, వద్దా అన్న అంశంపై కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న చర్చకు త్వరలోనే తెరపడనుంది. కారుణ్య మరణాలను (ఎథనేషియా) అనుమతిస్తూ ముసాయిదా బిల్లును కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించింది. దీనిపై ముందుగా ప్రజాభిప్రాయం కోరతామని, వారినుంచి వచ్చే సూచనలు పరిగణలోకి తీసుకొని సమగ్ర చట్టాన్ని తీసుకొస్తామని 'జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్' డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. కారుణ్య మరణాలను అనుమతించేందుకు 'ప్రొటెక్షన్ ఆఫ్ పేషంట్స్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్స్' చట్టంలో సవరణలు తీసుకురావాలి. చట్టం తీసుకొస్తే భారత వైద్యమండలి (ఎంసీఐ) కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. మెడికల్ ప్రాక్టీషనర్లకు సరైన మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుంది.

కారుణ్య మరణాలను అమలు చేసేందుకు యాక్టివ్ ఎథనేషియా, పాసివ్ ఎథనేషియా అనే రెండు పద్ధతులు ఉంటాయి. ప్రాణాంతక జబ్బుతో బాధపడుతూ ఇక ఎంతమాత్రం బతకరని తెలిసిన రోగుల విషయంలో కొన్ని దేశాలు యాక్టివ్ ఎథనేషియాను, మరికొన్ని దేశాలు పాసివ్ ఎథనేషియాను అమలు చేస్తున్నాయి. యాక్టివ్ ఎథనేషియా అంటే ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మృత్యువును ప్రసాదించడం. పాసివ్ ఎథనేషియా అంటే చికిత్సను ఆపేసి లైఫై సపోర్ట్ వ్యవస్థను తొలగించి రోగి తనంతట తానే చనిపోయేలా చేయడం. యాక్టివ్ ఎథనేషియాను దుర్వినియోగం చేసే అవకాశం ఉండడంతో పాసివ్ ఎథనేషియాకే కేంద్రం మొగ్గు చూపిందని డాక్టర్ జగదీష్ తెలిపారు.

అరుణ షాన్‌బాగ్ అనే నర్సు విషయంలో దేశంలో కారుణ్య మరణాలను అనుమతించాలంటూ తీవ్రస్థాయిలో డిమాండ్ వచ్చింది. ఆమె రేప్ కారణంగా 42 ఏళ్లపాటు ఆస్పత్రి పడకపై జీవచ్ఛవంలా గడిపింది. ఆమె పనిచేసిన అస్పత్రి నర్సులే ఆమెను అన్నేళ్ల పాటు చూసుకున్నారు. కామన్ కాజ్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ 2005లో దాఖలు చేసిన పిటిషన్‌ను రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు విచారించినప్పుడు మరోసారి కారుణ్య మరణాలపై చర్చ జరిగింది. ఈ పిటిషన్ విషయంలో అభిప్రాయాలు తెలియజేయాలంటూ కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు కోరింది. అప్పుడు కేంద్రం కారుణ్య మరణాలను అనుమతించేందుకు నిరాకరించింది. కారుణ్య మరణాలను అనుమతించాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం తిరస్కరించింది. ఇప్పుడు అదే లా కమిషన్ మళ్లీ చేసిన సిఫార్సును ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement