విమానయానం.. కొత్త కొత్తగా...

Domestic airlines to resume flights at one-third capacity from Monday - Sakshi

మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

కనిష్ట – గరిష్ట టికెట్ల ధరలు; మధ్యస్త ధరకు 40% టికెట్లు

ఫ్లైట్‌లో ఫుడ్‌ సప్లై ఉండదు; ఒకే చెక్‌–ఇన్‌ బ్యాగ్‌కు అనుమతి

కంటెయిన్‌మెంట్‌ జోన్లవారికి నో ఎంట్రీ

న్యూఢిల్లీ: దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేలా పలు ఆంక్షలను ప్రకటించింది. విమానం ప్రయాణించిన కాలం ఆధారంగా కనిష్ట, గరిష్ట చార్జీలను నిర్ధారించింది. దేశవ్యాప్తంగా విమాన మార్గాలను ఏడు బ్యాండ్స్‌గా విభజించామని పౌర విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి గురువారం  వెల్లడించారు.

విమాన ప్రయాణ సమయం 40 నిమిషాల లోపు ఉంటే తొలి బ్యాండ్‌గా, 40–60 నిమిషాల మధ్య ఉంటే రెండో బ్యాండ్, 60–90 నిమిషాల మధ్య ఉంటే మూడో బ్యాండ్, 90–120 నిమిషాల మధ్య ఉంటే నాలుగో బ్యాండ్, 120–150 నిమిషాల మధ్య ఉంటే ఐదో బ్యాండ్, 150–180 నిమిషాల మధ్య ఉంటే ఆరో బ్యాండ్, 180–210 నిమిషాల మధ్య ఉంటే ఏడో బ్యాండ్‌గా నిర్ధారించామన్నారు. కనిష్ట, గరిష్ట ధరలను నిర్ధారించేందుకే ఇలా బ్యాండ్స్‌గా విభజించామన్నారు.

ఈ విభజన, చార్జీలపై పరిమితి ఆగస్ట్‌ 24 వరకు అమల్లో ఉంటుందన్నారు. ప్రతీ విమానంలో కనిష్ట– గరిష్ట ధరలకు మధ్య సరిగ్గా సగం ధరకు 40% టికెట్లను అమ్మాల్సి ఉంటుందని విమానయాన శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం 33% ఆపరేషన్లకే అనుమతించామని హర్దీప్‌ చెప్పారు. కరోనా కట్టడికి, చార్జీల వసూలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను అన్ని విమానయాన సంస్థలు ఖచ్చితంగా పాటించాలన్నారు.

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ‘వందేభారత్‌’ కార్యక్రమంలో ప్రైవేటు విమానయాన సంస్థలూ త్వరలో పాలుపంచుకుంటాయన్నారు. ఇప్పటివరకు ఎయిర్‌ఇండియా, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలు మాత్రమే ఈ మిషన్‌లో పాలుపంచుకుంటున్నాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిన మార్చి 25 నుంచి విమాన ప్రయాణాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రయాణీకులు పాటించాల్సిన పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.  
          
ఇవీ నిబంధనలు..
► 14 ఏళ్ళు దాటిన ప్రయాణికులంతా తమ మొబైల్స్‌లో ఆరోగ్యసేతు యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్దనే సీఐఎస్‌ఎఫ్, లేదా వైమానిక సిబ్బంది యాప్‌ ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోని వారిని ప్రత్యేక కౌంటర్‌కి పంపి, యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. అరోగ్య సేతు స్టేటస్‌లో రెడ్‌ మార్క్‌ కనిపిస్తే వారిని లోనికి అనుమతించరు.  

►  ఫ్లైట్‌ బయలు దేరడానికి  కనీసం రెండు గం టల ముందు ఎయిర్‌పోర్టులో రిపోర్టు చే యాలి. ఫ్లైట్‌ బయలుదేరేందుకు 4 గంటల ముం దు మాత్రమే టెర్మినల్‌ బిల్డింగ్‌లోనికి అనుమతిస్తారు.

►  కేవలం వెబ్‌ చెక్‌–ఇన్‌ చేసుకున్న వారిని మాత్రమే విమానాశ్రయం లోనికి అనుమతిస్తారు. విమానాశ్రయాల్లో ఫిజికల్‌ చెక్‌–ఇన్‌ కౌంటర్లు ఉండవు.
 

►  కేవలం ఒక చెక్‌–ఇన్‌ బ్యాగేజ్‌ని మాత్రమే తీసుకెళ్ళాల్సి ఉంటుంది.

►  ఫ్లైట్‌లో భోజన సదుపాయం ఉండదు.

►  ఫ్లైట్‌ బయలుదేరడానికి గంట ముందు బోర్డింగ్‌ ప్రారంభం అవుతుంది.

►  టెర్మినల్‌లోకి ప్రవేశించడానికి ముందు తగు రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం మొత్తం మాస్క్, గ్లవ్స్‌ ధరించడం తప్పనిసరి.

►  కంటెయిన్‌మెంట్‌ జోన్లలోని వారికి, కరోనా పాజిటివ్‌ వచ్చినవారికి అనుమతి లేదు.

►  ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా, లేదా స్వీయ హామీ పత్రంద్వారా తాము ఆరోగ్యంగా ఉన్నట్టు ధ్రుకరించాలి.

►  వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది.

►  కోవిడ్‌–19 అనుమానితులకు పరీక్షలు జరిపేందుకు, వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు ప్రత్యేక సౌకర్యాలు విమానాశ్రయాల్లో కల్పించాలి.

► విమానయాన సిబ్బందికి పీపీఈ కిట్లు తప్పనిసరిగా అందించాలి.

►  విమానాశ్రయాల్లో పీపీఈ కిట్లు మార్చుకోవడానికి సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

► అన్ని ప్రవేశ ప్రాంతాల్లో ప్రయాణికులకు శానిటైజర్లు అందుబాటులో ఉండే ఏర్పాటు చేయాలి.

►  విమానాశ్రయాల్లో న్యూస్‌పేపర్‌ గానీ, మ్యాగజైన్లు గానీ అందుబాటులో ఉండవు. అనుమతించరు.

►  ఎయిర్‌పోర్టులో ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ అందుబాటులో ఉంటాయి. అన్ని కోవిడ్‌–19 జాగ్రత్తలతో అమ్మకాలు జరగాలి.

►  ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న ఫుట్‌ మ్యాట్స్, కార్పెట్స్‌ని నిత్యం శుద్ధి చేస్తుండాలి.

►  ప్రయాణికులు విమానాశ్రయంలో, విమానంలో భౌతిక దూరం పాటించాలి.

►  విమానాశ్రయ సిబ్బంది ప్రయాణీకుల లగేజ్‌ను వారు టెర్మినల్‌ బిల్డింగ్‌లోకి వచ్చేముందే శానిటైజ్‌ చేయాలి.

►  డిపార్చర్, అరైవల్‌ ప్రాంతాల్లో ట్రాలీల వినియోగాన్ని ప్రోత్సహించవద్దు. అవసరమని భావిస్తేనే ట్రాలీ ఇవ్వాలి.

►  భౌతిక దూరం పాటించేందుకు వీలుగా సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ ప్రకారం, ప్రయాణికులను విమానంలోనికి అనుమతించాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top