కేంద్రమంత్రి దత్తాత్రేయను వెంటనే కేంద్రమంత్రి మండలి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: దళిత పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఆయనను కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. హెచ్‌సీయూలో రోహిత్ మరణం అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు ఆర్పీఎన్ సింగ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు.
ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి దత్తాత్రేయను వెంటనే కేంద్రమంత్రి మండలి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా హెచ్‌సీయూ వీసీని, ఈ వ్యవహారంలో ప్రమేయమున్న వ్యక్తులను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి దత్తాత్రేయ రాసిన లేఖ వల్లే వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో గచిబౌలి పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే.