బిగ్‌ బీకి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’

Dada Sahab Phalke award for Amitabh Bachchan - Sakshi

సినీ రంగంలో అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రం 

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగంలో ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారానికి బిగ్‌ బీని ఎంపిక చేసినట్లు కేంద్రం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ‘రెండు తరాల ప్రేక్షకులను అలరించి, స్ఫూర్తిదాయకంగా నిలిచిన దిగ్గజం అమితాబ్‌ను దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేశాం. దీనిపై దేశంతోపాటు అంతర్జాతీయ సమాజం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. ఆయనకు మా శుభాభినందనలు’అని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ ట్విట్టర్‌లో ప్రకటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న తన సినీ జీవితంలో ఆయన ఒక్కో మెట్టూ ఎదిగి ప్రపంచ సినీ వేదికపై ఎంతో కీర్తి సంపాదించుకున్నారు. ‘సాత్‌ హిందూస్తానీ’తో సినీ ప్రస్థానం ప్రారంభించిన బిగ్‌ బీ.. రాజేశ్‌ ఖన్నా హీరోగా నటించిన ‘ఆనంద్‌’లోనూ ఉన్నారు. అయితే, 1973లో జంజీర్‌ సినిమాతో యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా ఆయన పేరు దేశమంతటా మారుమోగిపోయింది.

ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆయన అన్ని రకాల పాత్రలు పోషించి జనాన్ని మెప్పించారు. దీవార్, జంజీర్, డాన్, షోలే లాంటివి కొందరికి నచ్చితే, బ్లాక్, పా, పికూ వంటివి మరికొందరి మెప్పు పొందాయి. స్టార్‌డమ్‌తో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయన.. ఒక దశలో వైఫల్యాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటీవల విడుదలైన ఆయన థ్రిల్లర్‌ సినిమా ‘బద్లా’కలెక్షన్ల పరంగా సూపర్‌హిట్‌ అయింది. ఆయన నటించిన చిత్రాలు చెహ్‌రే, గులాబో సితాబో, సైరా నరసింహారెడ్డి, బ్రహ్మాస్త్ర, ఆంఖే–2 వంటివి విడుదల కావాల్సి ఉంది. అమితాబ్‌ను దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించడంపై చిత్ర నిర్మాతలు కరణ్‌ జోహార్, మధుర్‌ భండార్కర్‌ తదితర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. 

ఏపీ సీఎం జగన్‌ శుభాకాంక్షలు 
సాక్షి, అమరావతి: దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికైన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన గొప్ప కళాకారుడైన అమితాబ్‌ను ఫాల్కే అవార్డుకు ఎంపిక చేయడం సముచితమైనదని జగన్‌ అభిప్రాయపడ్డారు. ఆయన తన యాక్షన్‌ సినిమాలతో గంభీరమైన గళంతో వీక్షకులను సమ్మోహన పరిచారని కొనియాడారు.

చదవండి : దాదా.. షెహెన్‌షా

 బచ్చన్‌ సాహెబ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top