
నువ్వు 'సీపీఎం'.. నీకు నీళ్లు లేవు!
తాగునీటి కోసం బావి వద్దకు వెళ్లిన కుటుంబాన్ని గ్రామస్తులు చితకబాదిన దారుణ సంఘటన బెంగాల్ లోని దక్షిణ 24పరగణా జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
తాగునీటి కోసం బావి వద్దకు వెళ్లిన కుటుంబాన్ని గ్రామస్తులు చితకబాదిన ఘటన బెంగాల్ లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. 60 ఏళ్ల నిమాయ్ సాన్పుయ్ కుటుంబం 24 పరగణా జిల్లాలో నివసిస్తోంది. గురువారం రాత్రి నిమాయ్ కోడలు నీటి కోసం గ్రామంలోని బావి దగ్గరకు వెళ్లగా కొంతమంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను దూషించారు.
ఈ బావి తృణమూల్ కాంగ్రెస్ నిర్మించిందని.. ఇక్కడ సీపీఎం వాళ్లకు నీళ్లు దొరకవని చెప్పి పంపేశారు. దీంతో కుటుంబం మొత్తం బావి దగ్గరకు చేరుకుని నీరు తోడుకునే హక్కు తమకూ ఉందని చెప్పడంతో వాళ్లు దాడికి తెగబడినట్లు నిమాయ్ భార్య కాళిదాసీ తెలిపారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటేయాలని తమపై ఒత్తిడి చేశారని ఆమె వివరించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు సమర్ సాన్పుయ్, సుభాష్ సాన్పుయ్ లపై నిమాయ్ కుటుంబం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ ఈ సంఘటన వెనుక ఎటువంటి రాజకీయ చర్యలు లేవని పేర్కొంది.