ఒకే రోజు 7,466 కేసులు | Sakshi
Sakshi News home page

ఒకే రోజు 7,466 కేసులు

Published Sat, May 30 2020 5:15 AM

COVID-19: 7466 Coronavirus Cases In India In 24 Hours - Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్న వేళ దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 7,466 కొత్త కేసులు నమోదు కాగా, 175 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌ దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ తొమ్మిదో స్థానానికి ఎగబాకింది.

మొత్తంగా కేసులు లక్షా 65 వేల 799 వరకు చేరుకున్నాయని కేంద్రం  వెల్లడించింది. మే 22 నుంచి ప్రతిరోజూ సగటున 6 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్‌ కేసులు చైనా కంటే రెట్టింపు నమోదైతే, మృతుల సంఖ్యలో కూడా చైనాని భారత్‌ దాటేసింది. చైనాలో మొత్తం కేసులు 84వేలు కాగా భారత్‌లో లక్షా 65 వేలు దాటి పోయాయి. ఇక కోవిడ్‌ మరణాల్లో చైనాను మించిపోయాం. జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ డేటా ప్రకారం చైనాలో ఇప్పటివరకు 4,638 మంది మరణిస్తే భారత్‌లో మృతుల సంఖ్య 4,706కి చేరుకుంది.  అయితే భారత్‌లో రికవరీ రేటు 42.89%గా ఉండటం ఊరట కలిగించే అంశం.     

బెంగాల్‌ మంత్రికి పాజిటివ్‌
పశ్చిమ బెంగాల్‌ మంత్రి సుజిత్‌ బోస్‌కు కరోనా సోకింది. ఇంట్లో నౌకరుకు కరోనా సోకడంతో మంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మంత్రితో పాటు కుటుంబ సభ్యుల్లో మరొకరికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా, రాజ్యసభ సెక్రటరేరియెట్‌లో పనిచేసే అధికారి ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో పార్లమెంటు భవనంలో రెండు ఫ్లోర్లను పోలీసులు సీజ్‌ చేశారు.
 

Advertisement
Advertisement