మోదీ ప్రభుత్వంలో నిరసన గళాలు | corruption allegations on narendra modi government | Sakshi
Sakshi News home page

మోదీ ప్రభుత్వంలో నిరసన గళాలు

Jun 27 2015 2:28 PM | Updated on Sep 22 2018 8:22 PM

మోదీ ప్రభుత్వంలో నిరసన గళాలు - Sakshi

మోదీ ప్రభుత్వంలో నిరసన గళాలు

‘పార్టీలో 75 ఏళ్లు దాటిన నేతల మెదళ్లు చచ్చిపోయాయి (బ్రెయిన్ డెడ్) అని 2014, మే 26న ప్రకటించారు.

న్యూఢిల్లీ: అవినీతి రహిత భారతాన్ని ఆవిష్కరిస్తానన్న హామీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ఆదిలో ప్రభుత్వాన్ని క్రమశిక్షణ బాటలో నడిపిస్తానని చెప్పుకున్నారు. ఆ దిశగా కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. తొలిసారి పార్లమెంట్ హాలులో అడుగుపెట్టిన పార్టీ సభ్యులకు మార్గదర్శకాలను సూచించారు. సెషన్ ముగిశాక పార్లమెంట్ సెంట్రల్ హాలులో గడపొద్దని, మీడియాకు దూరంగా ఉండాలని, వీలైనంత వరకు పార్లమెంట్ లైబ్రరీలో పుస్తకాలు ముందేసుకొని కూర్చోవాలని నీతి పాఠాలు చెప్పారు.

పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ఢిల్లీలో ఉండకుండా సొంత నియోజక వర్గాలకు వెళ్లాలని చెప్పారు. పోలీసుల నియామకాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్‌కు యూపీ ఎన్నికల్లో పార్టీ టెక్కెట్ నిరాకరించడం ద్వారా పార్టీ ఎంపీలకు కఠిన సందేశం పంపించారు. విదేశీ పర్యటనకు బయల్దేరిన ఓ మంత్రి సరిగ్గా దుస్తులు ధరించనందుకు మందలించారు. ఓ పారిశ్రామిక వేత్తతో ఐదు నక్షత్రాల హోటల్లో సమావేశమైన మరో మంత్రిని చీవాట్లు పెట్టి పవర్ బ్రోకర్లకు దూరంగా ఉండాలని ఆదేశించారు.

‘ఆల్‌వేస్ బిగ్ బ్రదర్ వాచింగ్ యూ, బిహాండ్’ అన్న భయం పార్టీ ఎంపీల్లో కలిగించారు. విపక్షాల సంగతి వదిలేస్తే మోదీ పాలనపై ఏడాది పాటు సొంత పార్టీ నుంచి ఎలాంటి విమర్శలు చేసే ధైర్యం ఎవరికి లేకపోయింది. మోదీ ఏడాది హానిమూన్ ముగియడంతో ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిరసన గళాలు బహిరంగంగానే వినిపించడం మొదలైంది. లలిత్ మోదీ వ్యవహారంతో ఇవి మరింత బట్టబయలయ్యాయి.

గత నెలలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆరెస్సెసెకు సన్నిహితంగా మెలిగే లోక్‌సభ ఎంపీ భరత్ సింగ్ ప్రభుత్వంపై తొలి నిరసన గళం విప్పారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యాక కూడా దేశంలో అభివృద్ధి అన్నది కళ్లకు కానరావడంలేదని విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలోనే మంత్రులెవరూ తమకుగానీ, ప్రజలకుగానీ అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపీలు బల్లలుగుద్ది మరీ భరత్ సింగ్ వ్యాఖ్యలను సమర్థించారు.

సుష్మా స్వరాజ్ ఎపిసోడ్ వెలుగులోకి రాగానే మాజీ క్రికెటర్, పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్, ఇది పార్టీ లోపలి వ్యక్తుల పనేనంటూ ఆరోపించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న విషయం స్పష్టమే. విదేశీ మారక ద్రవ్యం చట్టం ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుణ్ జైట్లీ, శరద్ పవార్, రాజీవ్ శుక్లా, ఎన్. శ్రీనివాసన్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిమాండ్ చేశారు.

రెండో ఐపీఎల్ సీజన్ సందర్భంగా బీసీసీఐ సభ్యులపై, ఎగ్జిక్టూటివ్ కౌన్సిల్‌పై వ చ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపకపోతే ప్రతిపక్షాలతో కలిసి పార్లమెంట్‌లో గొడవ చేయడానికి కూడా తాను సిద్ధమేనని కూడా ఆజాద్ ప్రకటించారు. మరో బీజేపీ ఎంపీ ఆర్‌కే సింగ్ కూడా ప్రభుత్వ సుశుప్తావస్థపై ధ్వజమెత్తారు. పరారీలో నిందితుడు లలిత్ మోదీకి సుష్మా స్వరాజ్, వసుంధరా రాజె ఏ విధంగా సహకరించినా తప్పేనని ఓ టీవీ ఇంటర్వ్యూలో విమర్శించారు. తక్షణం లలిత్ మోదీ వీసాను రద్దుచేసి ఆయన్ని భారత్‌కు రప్పించి, చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు.

వారం రోజుల ముందే మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా  మోదీ తీరుపై విమర్శలు గుప్పించారు. 75 ఏళ్ల పైబడిన రాజకీయ నేతలను మంత్రివర్గంలోకి తీసుకోరాదంటూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, ‘పార్టీలో 75 ఏళ్లు దాటిన నేతల మెదళ్లు చచ్చిపోయాయి (బ్రెయిన్ డెడ్) అని 2014, మే 26న ప్రకటించారు. బ్రెయిన్ డెడ్ అయిన వారిలో నేనొకణ్ని’ అని 82 ఏళ్ల సిన్హా వ్యాఖ్యానించారు.

ప్రభుత్వానికి, పార్టీకి దూరంగా పెట్టిన పార్ట వృద్ధ నేతల్లో అసహనం మరింత పెరుగుతుందన్న విషయం తెల్సిందే. నరేంద్ర మోదీ పెట్ ప్రాజెక్టు గురించి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ప్రస్తావిస్తూ మరో యాభై ఏళ్లయినా ‘గంగా ప్రక్షాళన’ పూర్తికాదంటూ ఆరోపించిన విషయం తెల్సిందే. దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యలు కూడా మోదీని ఉద్దేశించి చేసినవే అనడంలో సందేహం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement