మోదీ అవినీతిని బయటపెడదాం

Rahul Gandhi chairs CWC meet, decides to target Modi govt on corruption - Sakshi

 ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాఉద్యమం

సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం

త్వరలోనే కార్యాచరణ విడుదల

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్‌ అనధికారికంగా ప్రారంభించింది. మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేసేందుకు ప్రజాఉద్యమాలు తీసుకురావాలని నిర్ణయించింది. దీనమైన దేశ ఆర్థిక స్థితి, బ్యాంకు కుంభకోణాలు, రాఫెల్‌ ఒప్పందం తదితర అంశాలపై దూకుడుగా బీజేపీని ఎదుర్కొనాలని శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం నిర్ణయించింది. పార్టీ చీఫ్‌ రాహుల్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలకమైన అస్సాం జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్నార్సీ) అంశంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు.

రాహుల్‌తోపాటుగా మాజీ ప్రధాని మన్మోహన్, ఏకే ఆంటోనీ, ఆజాద్,  ఖర్గే, అహ్మద్‌ పటేల్, అశోక్‌ గెహ్లాట్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు. యూపీఏ చైర్‌పర్సన్, మాజీ అధ్యక్షురాలు సోనియా వ్యక్తిగత కారణాలతో సీడబ్ల్యూసీ భేటీకి గైర్హాజరయ్యారు. పార్లమెంటు లోపలా, బయటా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంలో విపక్ష పార్టీలతో కలిసి ముందుకెళ్లాలని భేటీలో నిర్ణయించారు. ‘నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించాం. అవినీతి, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఇదే మంచి తరుణం’ అనంతరం రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

చోక్సీ, రాఫెల్‌లపై దూకుడుగా..
సమావేశ వివరాలను పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రజాందోళనను ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పీసీసీల సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 2017లో మెహుల్‌ చోక్సీకి పౌరసత్వం ఇచ్చినపుడు భారత విచారణ సంస్థలు క్లీన్‌చిట్‌ ఇచ్చాయని ఆంటిగ్వా ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకునే దేశం నుంచి చోక్సీని బయటకు పంపించిందని సుర్జేవాలా విమర్శించారు. రాఫెల్‌ ఒప్పందంపై ప్రధాని గానీ, రక్షణ మంత్రి గానీ ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదని సుర్జేవాలా అన్నారు.  

ఎన్నార్సీపై జాగ్రత్తగా..
అస్సాం ఎన్నార్సీ వివాదంపై కాంగ్రెస్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నార్సీ కాంగ్రెస్‌ పార్టీ మదిలో పుట్టిన గొప్ప ఆలోచన అని.. 1985లో మాజీ ప్రధాని రాజీవ్‌ చేసుకున్న అస్సాం ఒప్పందంలో భాగంగా ఎన్నార్సీ రూపకల్పన జరిగిందని సుర్జేవాలా తెలిపారు. భారతీయ పౌరుల్లో ఒక్కరు కూడా ఈ జాబితానుంచి తప్పిపోకుండా పార్టీ తరపున భరోసా ఇస్తున్నామన్నారు. 2005 నుంచి 2013 వరకు కాంగ్రెస్‌ పార్టీ 82,728 మంది బంగ్లాదేశీయులను బహిష్కరిస్తే.. ఎన్డీయే ప్రభుత్వం నాలుగేళ్లలో 1,822 మంది బంగ్లాదేశీయులను మాత్రమే బయటకు పంపిందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top