‘నిజాముద్దీన్‌’పై కేంద్ర హోంశాఖ నజర్‌

Coronavirus: Central Home Ministry Investigated On Nizamuddin Markaz In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడి నేపథ్యంలో నిజాముద్దీన్‌ మర్కజ్‌పై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. ఈ క్రమంలో మర్కజ్‌ కార్యక్రమానికి ఎవరెవరు హాజరయ్యారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌, నేపాల్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, కజకిస్తాన్‌ నుంచి వచ్చిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు హోంశాఖ నిర్థారించింది. విదేశాల నుంచి వచ్చిన వారు మర్కజ్‌ భవనంలో రిపోర్టు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తారని, వీరు వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కోర్డినేటర్‌ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని చెప్పింది. మార్చి 21 నాటికి మర్కజ్ భవనంలో 1746 మంది ఉన్నారని, వారిలో 1530 మంది దేశీయలు కాగా.. 216 మంది విదేశీయలు ఉన్నట్లు తెలిపింది. (‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’)

ఇక భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలు కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారని హోంశాఖ పేర్కొంది. కాగా ఈ 824 మంది విదేశీయులను కోవిడ్‌-19 స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారిని క్వారంటైన్‌కు పంపాలని రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపింది. అదే విధంగా వీరితో పాటు భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలు, జిల్లా కోర్డినేటర్లకు కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని పోలీసులను ఆదేశించామంది. ఇప్పటి వరకు 2137 మంది భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలను పరీక్షించి అవసరమైన మేరకు క్వారంటైన్‌కు తరలించామని తెలిపింది. దీంతో పాటు జమాత్ కార్యకర్తలు తిరిగిన ప్రాంతాలు, ప్రైమరీ కాంట్రాక్ట్ వ్యక్తుల వివరాలను సేకరించాలని ఐబీ రాష్ట్రాల డీజీపీలకు సూచించామని, ఈ ఆదేశం మేరకు రాష్ట్రాల పోలీసులు చర్యలు చేపడుతున్నారని తెలిపింది. 

మర్కజ్ భవనంలో మార్చి 26 నుంచి తబ్లీక్ జమాత్ కార్యకర్తలు అందరినీ స్క్రీనింగ్ చేస్తున్నామని కూడా తెలిపింది. ఇక  1203 మందికి స్క్రీనింగ్ చేయగా 303 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామంది. వారిని దిల్లీలోని వివిధ ఆస్పత్రులకు తరలించగా.. మిగతావారిని  నరేలా, బక్కర్ వాలా, సుల్తాన్ పూరిలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని పేర్కొంది. జనవరి 1 నుంచి తబ్లీక్ జమాత్ కార్యక్రమాల కోసం భారత్ వచ్చిన 2100 మంది విదేశీయులను గుర్తించామని, ఈ మేరకు ఇమీగ్రేషన్ బ్యూరో ఆయా రాష్ట్రాలకు విదేశీయుల రాకపై వివరాలను అందిస్తోందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top