పరమౌషధం కానున్న ప్లాస్మా!

Convalescent plasma therapy for COVID-19 - Sakshi

న్యూఢిల్లీ: కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వైద్యులకు ప్లాస్మా యాంటీ బాడీలతో చికిత్స మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. కోవిడ్‌ నుంచి కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మా యాంటీ బాడీలను తీసుకొని వాటిని కోవిడ్‌ రోగికి ఎక్కించడం ద్వారా ఎక్కువ శాతం ఫలితం వస్తోందని, మరణాల రేటు చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కన్వాల్సెంట్‌ ప్లాస్మా చికిత్సపై పరిశోధనలు జరిపేందుకు ముందుకొచ్చే సంస్థలు దరఖాస్తు చేసుకోవాలంటూ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సూచించడం తెల్సిందే. దీంతో కొన్ని సంస్థలు పరీక్షలు జరిపేందుకు ముందుకొచ్చాయి.

ఈ వ్యవహారానికి తాజాగా సెంట్రల్‌ డ్రగ్‌ రెగ్యులేటర్‌ అనుమతి ఇచ్చింది. ఐసీఎంఆర్‌ రూపొందించిన ప్రొటోకాల్‌ ప్రకారం దీనికి అనుమతులిచ్చింది. సెంట్రల్‌ డ్రగ్‌ రెగ్యులేటర్‌కు ఐసీఎంఆర్‌ ఇచ్చిన నివేదికలో ప్లాస్మా చికిత్స పరిశోధనలపై పనిచేయనున్న సంస్థల వివరాలు ఉన్నాయి. ప్రజా ప్రయోజనాలను పరిగణలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డ్రగ్‌ రెగ్యులేటరీ తెలిపింది. వాటిని తమ సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ పూర్తిగా పరిశీలించినట్లు వెల్లడించింది. డ్రగ్స్‌ అండ్‌ క్లినికల్‌ ట్రయల్‌ రూల్స్‌ కింద అనుమతులిచ్చినట్లు స్పష్టం చేసింది.

ఇదే ముందున్న మార్గమా?
అమెరికా ఎఫ్‌.డీ.ఏ కన్వాల్సెంట్‌ ప్లాస్మా చికిత్స ద్వారా కోవిడ్‌ వైద్యులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా అయిదు మంది కరోనా రోగులకు ఆ వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తుల యాంటీబాడీలు కలిగిన ప్లాస్మాను ఎక్కించారు. అందులో ముగ్గురు ఇప్పటికే కోలుకోగా, మరో ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉంది. మరణాలు అసలులేకపోవడం ఆశాజనకంగా మారింది. మరోవైపు భారత్‌లో నలుగురు రోగులపై ప్లాస్మా చికిత్సను ప్రయోగించగా, వారిలో గర్భిణిసహా అందరూ కోలుకున్నట్లు ఐసీఎంఆర్‌ ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top