సజ్జన్‌ కుమార్‌ను దోషిగా తేల్చిన హైకోర్టు

Congress Leader Sajjan Kumar Convicted In Anti Sikh Riots - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ను 1984 సిక్కు వ్యతిరేక ఘర్షణల కేసులో ఢిల్లీ హైకోర్టు సోమవారం దోషిగా తేల్చింది. ఈ కేసులో కాంగ్రెస్‌ నేతకు విముక్తి కల్పిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో సజ్జన్‌ కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. 1984, అక్టోబర్‌ 31న ఇందిరా గాంధీ హత్యానంతరం ఢిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఐదుగురి హత్యకు సంబంధించిన కేసులో జస్టిస్‌ మురళీధర్‌, జస్టిస్‌ వినోద్‌ గోయల్‌తో కూడిన బెంచ్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొన్న హైకోర్టు ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భరోసాను బాధితుల్లో కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో సజ్జన్‌ను నిర్ధోషిగా పేర్కొంటూ మరో ఐదుగురిని దోషులుగా పేర్కొన్నప్రత్యేక న్యాయస్ధానం ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది.

మాజీ కౌన్సిలర్‌ బల్వాన్‌ కొక్కర్‌, మాజీ ఎమ్మెల్యే మహేందర్‌ యాదవ్‌, కిషన్‌ కొక్కర్‌, గిర్ధారి లాల్‌, కెప్టెన్‌ భాగ్మల్‌లను కేసులో దోషులుగా 2013లో ప్రత్యేక న్యాయస్ధానం స్పష్టం చేసింది. ఢిల్లీలోని కంటోన్మెంట్‌కు చెందిన రాజ్‌నగర్‌ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని కేహార్‌ సింగ్‌, గుర్‌ప్రీత్‌ సింగ్‌, రాఘవేందర్‌ సింగ్‌, నరేందర్‌ పాల్‌ సింగ్‌, కుల్దీప్‌ సింగ్‌లను హత్య చేసిన కేసులో సజ్జన్‌ కుమార్‌ సహా ఐదుగురు ఇతరులు విచారణ ఎదుర్కొన్నారు. జస్టిస్‌ జీటీ నానావతి కమిషన్‌ సిఫార్సుల మేరకు సజ్జన్‌ కుమార్‌ ఇతరులపై 2005లో కేసు నమోదైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top